Telangana: తెలంగాణకు కేంద్రం మరో శుభవార్త.. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త అందించింది. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు ప్రోత్సాహకం అందించింది. ఈ మేరకు రూ.424 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవి ఇప్పటికే రాష్ట్రానికి అందాయి. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందాయి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా కేంద్రం నిధులు విడుదల చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా రూ.424 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో 3 రాష్ట్రాలు ఈ ఘనత సాధించగా.. అందులో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం కింద రాష్ట్రానికి నిధులు అందాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రైతులకు ప్రత్యేక ఐడీ నెంబర్
ఫార్మర్ రిజిస్ట్రీ లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు అధికారులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరి చేసింది. రైతులందరూ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బాధ్యతను అప్పగించింది. ఇది చేయించుకున్న రైతులకు ఒక యూనిక్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఆధార్ కార్డు వివరాల ఆధారంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ రైతులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్ 11 అంకెలు ఉంటుంది. పీఎం కిసాన్ సాయం పొందాలన్నా, ఇక ఇతర రాయితీలు పొందాన్నా ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐడీ పొందటం అనేది తప్పనిసరి. ఇందుకోసం రైతులు అధికారులకు పట్టదారు పాసు బుక్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, ఆధార్ అందించాలి. ఇందుకు చివరి తేదీని ఫిబ్రవరి 28గా కేంద్రం నిర్ణయించింది.
ఎలా చేయించుకోవాలి..?
సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. లేకపోతే సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్లను సంప్రదించి కూడా చేసుకోవచ్చు. రైతులు ఐడీ నెంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలి. కేంద్రం, రాష్ట్రం నుంచి విత్తన సబ్సిడీ, రుణాలు, నగదు లాంటివి అంతరాయం కలగకుండా పొందటంలో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇది కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది. రైతులు గ్రామ ఏఈవోను సంప్రదించి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పొందవచ్చు. రైతులకు ప్రత్యేకమైన గుర్తింపు, ప్రయోజనాలను ఈ ఐడీ కల్పిస్తోంది. రైతులందరూ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రభుత్వం ర్యాలీలు నిర్వహిస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరి చేసింది. ఏపీలో కూడా ఈ ప్రక్రియ చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రైతుల దగ్గరికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏపీలో కూడా చాలామంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోగా.. ఇంకా కొంతమందివి పెండింగ్‌లో ఉన్నాయి.
