Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇకపై 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే..

స్వరాష్ట్రంలో ఉంటూ వైద్య విద్యనభ్యసించాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌- బి కేటగిరీల్లో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా నిబంధనలు సవరించింది.

Telangana: ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇకపై 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే..
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2022 | 6:30 AM

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి కేట‌గిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థుల‌కే ద‌క్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థుల‌కే ల‌భించ‌నున్నాయి.

రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 నాన్ మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనార్టీ కాలేజీల్లో 3200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణ మేరకు బి కేటగిరీలో ఉన్న 35% సీట్లలో 85% సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15% (168) సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడుతారు. ఓపెన్ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనార్టీ కాలేజీలో 25% బి కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85% అంటే 116 సీట్లు ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి.

ఇప్పటి వ‌ర‌కు రాష్ట్రంలో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ద చూపించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూరేలా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో 1,068 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఎంబీబీఎస్ విద్య కోసం ఇతర రాష్ట్రాలు సహా, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే డాక్టర్ చదివేందుకు అవకాశాలు కలుగనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..