Telangana: ఏళ్లనాటి ఆచారం.. ఆ జిల్లాలో ఆలస్యంగా బతుకమ్మ పండగ.. ప్రత్యేకంగా వారికోసమేనట
సాధారణంగా దసరా పండగ పదిరోజులు జరుగుతుంది. పండగకు పదిరోజుల ముందు నుంచే ప్రజలు గ్రామాల్లో బతుకమ్మలను ఏర్పాటు చేసి ఆట పాటలు ఆడుతారు. కానీ తెలంగాణలోని జామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో మాత్రం ఈ దసరా పండగను ఇందుకు భిన్నంగా పండగ పూర్తైన ఐదు రోజులకు జరుపుకుంటారు. ఇంతకు వీళ్లు బతుకుమ్మ పండగను ఇలా ఆలస్యంగా ఎందుకు చేసుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పండగపూట ఇంట్లో ఆడపడుచులు వుంటే ఆనందం రెట్టింపు అవుతోందని ఆలస్యంగానైనా వారి సమక్షంలో పండగ జరుపుకోవాలనే సంప్రదాయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఆనవాయితీగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దసరా పండగకు ముందు బతుకమ్మ పండగను నిర్వహిస్తారు. కానీ ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం అలా జరుపుకోరు. దసరా అనంతరం ఐదు రోజులకు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 66 ఏండ్లకు పైగా వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆచారాన్ని కొనసాగించారు..ఈరోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏటా దసరా తరువాత పౌర్ణమికి ముందు ఇక్కడ భిన్నంగా బతుకమ్మ పండగ నిర్వహిస్తారు. సుమారు 2వేలకు పైగా బతుకమ్మలను పేర్చి ఆడుతారు. స్థానికులు తెలిపిన రెండు కథలు వేర్వేరుగా ప్రచారంలో ఉన్నాయి. వీటి ఆధారంగానే బతుకమ్మను కొనసాగిస్తున్నారు.
పూర్వకాలంలో ఎడపల్లి సంస్థానం దేశ్‌ముఖ్‌ల పాలనలో ఉండేది. ఏడు గ్రామాలు వీరి పాలనలో కొనసాగేవి. దసరా పండగకు పుట్టింటి ఆడపడుచులు అత్త వారింట్లో ఉంటారు. దసరాకు ముందు బతుకమ్మ పండగ నిర్వహిస్తే ఆడపడుచులందరూ వచ్చే అవకాశం ఉండదు. అందుకని నాడు ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి నూతన ఈ సంస్కృతికి నాంది పలికారని ప్రచారంలో ఉంది. దసరా తరువాత బతుకమ్మ పండగ నిర్వహిస్తే ఆడపడుచులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇంటి కోడళ్లు అందరూ ఐక్యతగా పండగలో పాల్గొంటారని.. అందరితో కలిసి పండగని ఘనంగా నిర్వహించుకోవచ్చనే భావనతో దసరా తరువాత 5వ రోజు పౌర్ణమికి ముందు బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడు దసరా తర్వాత 3వ రోజుకే బతుకమ్మను నిర్వహిస్తున్నారు.
ఇక మరో కథ ప్రకారం దేశ్‌ముఖ్‌ల పాలనలోనే 66 సంవత్సరాల క్రితం బతుకమ్మను దేశ్‌ముఖ్‌ల గడిలో అంగరంగ వైభవంగా జరిపేవారు. గ్రామస్తులంతా కలిసి దేశ్‌ముఖ్ గడి వద్దనే బతుకమ్మ ఆడేవారు. దేశ్‌ముఖ్‌ల సిపాయి తుపాకీ పేల్చిన తర్వాత బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకువెళ్లేవారు. అయితే బతుకమ్మ పండుగ రోజు దేశ్‌ముఖ్‌ల సిపాయి తుపాకీ పేల్చే సమయంలో మరో సిపాయికి తుపాకీ గుండు తగలడంతో మృతిచెందాడు. ఆరోజు మృతిచెందిన సిపాయి శవాన్ని, బతుకమ్మను ఉరేగించడం గ్రామానికి మంచిది కాదని భావించారు. అలాగే సిపాయి మృతిని ముట్టుడుగా భావించి ఆ సంవత్సరం నుంచి బతుకమ్మ పండగ దసరాకు ముందు జరపడం మానేశారు. అప్పటి నుంచి దసరా తర్వాత బతుకమ్మ ఆడటం ప్రారంభించారు. ఇదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది.
బతుకమ్మ పండుగ కోసం గ్రామస్తులు 10 రోజుల ముందు నుంచే గునక పూలను సేకరిస్తారు. వీటితో పెద్దపెద్ద బతుకమ్మలను తయారు చేస్తారు. ఒక్కో బతుకమ్మను నిలువెత్తు కంటే ఎత్తుగా పెద్దపెద్దగా చేయడానికి పోటీపడతారు. నేడు ఎడపల్లి మండలకేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఉండటంతో ఊరి ఆడపడుచులు అందరూ స్వగ్రామం ఎడపల్లి చేరుకున్నారు ..ఆనందోత్సవాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
