Hyderabad: తన బర్త్ డే అని కూల్ డ్రింక్ ఇచ్చిన పనోడు.. ఆ ఇంటి యజమాని తాగిన కాసేపటికే.!
ఆ రోజు పనోడి పుట్టిన రోజు.. ఇంట్లోని యజమానికి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. యజమాని కూడా ఆశగా డ్రింక్ తాగాడు. అంతే.! కాసేపటికే జరగాల్సింది జరిగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో.?

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్ ప్రాంతంలో సినిమా స్టైల్‌లో దోపిడీ జరిగింది. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు మత్తు మందు కలిపిన సాఫ్ట్‌డ్రింక్ తాగించి.. ఓ నేపాలి గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, నగలు ఎత్తుకెళ్లింది. దోచుకెళ్లిన బంగారు ఆభరణాలు, నగదు, డైమండ్ రింగ్ మొత్తం విలువ సుమారు రూ.20 లక్షలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. నందగిరి హిల్స్‌లో నివసిస్తున్న రవీందర్ శర్మ ఇంట్లో నేపాల్‌కు చెందిన భువన్ అనే వ్యక్తి సుమారు 15 రోజుల క్రితం వంటమనిషిగా చేరాడు. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటికీ అతనిపై ఎలాంటి అనుమానం రాకుండా, ఇంట్లోని వారితో స్నేహంగా మెలిగినట్లు పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి భువన్.. వాచ్‌మెన్‌తో పాటు అక్కడ పని చేస్తున్న ఇతర కార్మికులకు ఇవాళ తన బర్త్‌డే అంటూ సాఫ్ట్‌డ్రింక్ ఇచ్చాడు. అయితే ఆ సాఫ్ట్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఉండటంతో కొద్దిసేపటికే అందరూ స్పృహ కోల్పోయారు. పక్కాగా ప్లాన్ అమలు చేసిన భువన్.. తనతో పాటు వచ్చిన మరో ముగ్గురు నేపాలి వ్యక్తులతో కలిసి ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే ఈ ప్లాన్‌ను అమలు చేసినట్లు జూబ్లీహిల్స్ అదనపు డీసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు, నగదు, డైమండ్ రింగ్ ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గ్యాంగ్ కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు, వారు నందగిరి హిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఇంటి యజమాని రవీందర్ శర్మ నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో నేపాలి గ్యాంగ్‌ల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, కొత్తగా పనివాళ్లు లేదా సెక్యూరిటీ సిబ్బందిని నియమించేటప్పుడు ఆధార్ కార్డు, పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు అందించాలి అని పోలీసులు సూచించారు.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
