Telangana: రూ.2వేల కోసం హత్య.. ఫోన్, ఫ్యామిలీకి దూరంగా హంతకుడు.. చివరకు ఎలా చిక్కాడంటే..?
రవిని బాలాజీ విందుకు ఆహ్వానించాడు. ఆ విందులో అసలేం జరిగింది..? డబ్బుల మాటా మాటా పెరిగిన తర్వాత బాలాజీ తీసుకున్న దారుణ నిర్ణయం ఏమిటి..? రవిని ఏం చేశాడు? ఆ తర్వాత నిందితుడు సెల్‌ఫోన్‌కు దూరంగా, కుటుంబానికి దూరంగా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? పోలీసులు ఆ నిందితుడిని ఎలా పట్టుకున్నారు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకున్నాడు..

సమాజంలో హింస పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే హత్య చేయడం వంటివి బాగా పెరిగిపోయాయి. చూసి నవ్వారని, అప్పు ఇవ్వలేదని అవతలి వ్యక్తిని దారుణంగా చంపుతున్నారు. ఇటువంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం రూ. 2,050 అప్పు విషయంలో జరిగిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని తాండూరు పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం మన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన ముడావత్ రవి, వికారాబాద్ రహదారి పక్కన పొలంలో పనిచేసే బాలాజీకి 2023లో మద్యం కోసం సుమారు రూ. 2,050 ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని రవి, బాలాజీని గ్రామస్థుల సమక్షంలో గట్టిగా అడిగాడు. దీనితో తీవ్ర అవమానంగా భావించిన బాలాజీ, రవిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
విందు పేరుతో.. కత్తిపోటు
2023 ఆగస్టు 12న బాలాజీ, రవిని విందుకు పిలిచి మద్యం తాగించాడు. అప్పుల విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో బాలాజీ వెంట తెచ్చుకున్న కత్తితో రవి పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రవిని కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సెల్‌ఫోన్‌కు దూరంగా..
నిందితుడు బాలాజీ నిజామాబాద్ జిల్లాకు చెందినవాడు. హత్య తర్వాత అతను సెల్‌ఫోన్ వాడకుండా, కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటూ తప్పించుకున్నాడు. తన తల్లి మరణించినా అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బాలాజీ కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టారు. దీంతో శనివారం తెల్లవారుజామున సిద్దిపేటలోని తన సోదరుడు సంజీవ ఇంటి వద్ద ఉన్న బాలాజీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




