Munugode Bypoll: గులాబీ పార్టీని వేధిస్తున్న సింబల్స్ ఫీవర్.. ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు..
మునుగోడులో ఉపఎన్నిక రాజకీయం ఊపందుకుంటున్న వేళ హైదరాబాద్‌లో ఫిర్యాదుల హడావుడి మొదలైంది. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ గుర్తు కారును..
మునుగోడులో ఉపఎన్నిక రాజకీయం ఊపందుకుంటున్న వేళ హైదరాబాద్‌లో ఫిర్యాదుల హడావుడి మొదలైంది. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులను మార్చాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. ఫ్రీ సింబల్స్‌గా ఉన్న కొన్ని గుర్తులు EVMపై చూస్తే తమ కారు గుర్తుకు దగ్గరగా ఉందని గులాబీ పార్టీ నేతలు తెలిపారు. ఇది ఓటర్లలో గందరగోళానికి దారి తీస్తుందనే విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించామని వెల్లడించారు.
మరో వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. ఆయనను కట్టడి చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు వెల్లడించారు. బండి సంజయ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదవడం బాధాకరమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రకాశ్ రావు అన్నారు.
ఇదిలాఉంటే, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అహంకారానికి జరుగుతున్న ఉపఎన్నిక ఇదని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఒక అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే అని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా ఆయన తాను ప్రాతినిధ్యం వహించిన మునుగోడు నియోజకవర్గాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కేంద్రం నుంచి కాంట్రాక్టులు పొందినందునే బీజేపీలో చేరారని, ఆ కారణంగనే ఉపఎన్నిక వచ్చిందని దుయ్యబట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..