Green India Challenge: నాలుగవ ఏట అడుగు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అదిలాబాద్ కేంద్రంగా సరికొత్త అడుగు వేసింది. ఎమ్మెల్యే జోగు రామన్న 58వ పుట్టిన రోజు సందర్భంగా వన్ అవర్–వన్ మిలియన్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని తనవంతుగా వేప మొక్కను మొదటి మొక్కగా నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు నాటారు.
అదిలాబాద్ రూరల్ దుర్గానగర్ ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతమైన 200 ఎకరాల్లో యాదాద్రి మోడల్‌లో ఒక గంట వ్యవధిలోనే ఐదు లక్షల మొక్కలు నాటారు. ఇక అదిలాబాద్ రూరల్ బేల మండలంలో రెండు లక్షల మొక్కలు, అర్బన్ లో 45 వేల నివాసాల పరిధిలో ఒక లక్షా ఎనభై వేల మొక్కలు, జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరవైపులా ఒక లక్షా ఇరవై వేల మొక్కలు గంట వ్యవధిలోనే నాటారు. మొత్తం పది సెక్టర్లుగా విభజించిన ప్రదేశాల్లో సుమారు 30 వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు తోడు, పెద్ద సంఖ్య లో పాల్గొన్న అదిలాబాద్ వాసులు మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాగా, ట్రీ ప్లాంటేషన్‌తో పాటు.. ఎమ్మెల్యే జోగు రామన్న తన పుట్టిన రోజు సందర్భంగా రెండు అంబులెన్స్ లను ఎంపీ సంతోష్ చేతుల మీదుగా రిమ్స్ హాస్పిటల్ కు అందించారు.
ఇదిలాఉంటే, 2019లో టర్కిలో జరిగిన ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం.. ఒక గంటలో మూడు లక్షల మూడు వేల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. ఇప్పుడు దానికి మిన్నగా ఒక్క గంటలోనే పది లక్షలు మొక్కలు నాటి గిన్నిస్ రికార్డును తిరగరాయాలని నిర్ణయించారు. ఈ మేరకు మొక్కలు కూడా నాటారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీసిన నిర్వాహకులు గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం పంపనున్నట్లు వెల్లడించారు. మరోవైపు దుర్గా నగర్‌లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు అందించారు.
కాగా, పుట్టిన రోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎమ్మెల్యే జోగు రామన్నను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. మొక్కలు నాటిన ప్రతీ ఒక్కరూ వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. తాను స్వయంగా ప్రతి ఏటా ఈ మొక్కల పెరుగుదలను పర్యవేక్షిస్తానని చెప్పారు. కరోనా ఉధృతి వల్ల పర్యావరణం, ప్రకృతి ప్రాధాన్యత మరోసారి అందరికీ తెలిసివచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు కాలుష్యానికి చెక్ పెడతాయని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు దివాకర్ రావు, కోనేరు కోనప్ప, రేఖా నాయక్, విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు, బాపూ రావు, దుర్గం చిన్నయ్య, ఏమ్మెల్సీ పురాణం సతీష్, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ లోక భూమా రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, సీసీఎఫ్ రామ లింగం, అదిలాబాద్ కలెక్టర్ సిగ్డా పట్నాయక్, డీఎఫ్ఓ రాజ శేఖర్, ఎఫ్.డీ.ఓ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Also read:
జైలులో మగ ఖైదీలకు చుక్కలు చూపించిన మహిళా అధికారిణి.. మరీ ఇంత దారుణమా..?
AP Weather Alert: రాగల మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలాఉంటుందంటే..