Telangana: తల్లి కోసం పరితపిస్తున్న పాప.. ప్రజా సేవలో అమ్మ..
అమ్మ కావాలి.. ఒకసారి కనిపించు అమ్మా..అంటూ ఆ చిట్టి తల్లి తల్లడిల్లిపోతోంది. కంటి ఎదురుగా ఉన్నట్లే ఉండి.. మాయమవుతున్న అమ్మ కోసం.. ఆమె లాలన కోసం పరితపిస్తోంది. ఈ చిట్టి తల్లి కష్టం ఎవరికీ రాకూడదు..రాదేమో అనిపిస్తోంది.

అమ్మ కావాలి.. ఒకసారి కనిపించు అమ్మా..అంటూ ఆ చిట్టి తల్లి తల్లడిల్లిపోతోంది. కంటి ఎదురుగా ఉన్నట్లే ఉండి.. మాయమవుతున్న అమ్మ కోసం.. ఆమె లాలన కోసం పరితపిస్తోంది. ఈ చిట్టి తల్లి కష్టం ఎవరికీ రాకూడదు..రాదేమో అనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్.. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గత ఏడాది ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది . పెళ్లయిన 20 ఏళ్ళ తర్వాత వీరికి సంతానం కలిగింది. ఇన్ని సంవత్సరాలుగా సంతానం కోసం అమ్మ అనే పిలుపు కోసం ఎమ్మెల్యే దంపతులు చేయని పూజ లేదు మొక్కని దేవుడు లేడు. చివరికి గత ఏడాది దసరా రోజున కూతురు పుట్టడంతో హరిప్రియ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యే హరిప్రియకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కూతురుకు ‘రుద్ర భారతి ప్రియ’ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఆ చిన్నారికి వయసు 8 నెలలు.

ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు ప్రజా సమస్యలపై మండలాల్లో పర్యటనలు చేస్తూ ..కలెక్టరేట్‌కు, సచివాలయంకు, సీఎం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లక తప్పటం లేదు. నియోజక వర్గంలో మారుమూల ఏజెన్సీ కావడంతో నిత్యం వినతులు,పర్యటనలు, సభలు సమావేశాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఒక్కో రోజు ఇంటికి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. తల్లిలాలనకు అలవాటు పడిన ఆ చిన్నారి తల్లి ఎడబాటును తట్టుకోలేక తల్లడిల్లుతోంది. తల్లి కోసం తహతహలాడుతోంది. గుక్క పట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని లాలించడం అమ్మమ్మకు, కన్నతండ్రి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హరి సింగ్ నాయక్‌కు వశపడటం లేదు. గంటల తరబడి తల్లి కనపడకపోవటంతో లాలించడం ఎవరి తరం కావడం లేదు .





చిన్నారిని భుజం మీదికి ఎత్తుకొని గోడ మీద ఉన్న అమ్మ హరిప్రియ ఫోటో చూపించి మీ అమ్మ హరిప్రియ వస్తుందంటూ లాలిస్తున్నారు. ఇలా పాపను ఎత్తుకొని అమ్మ వస్తుంది అని బూచీ చెబుతూ పాప లాలించటం నిత్యకృత్యమైపోయింది. ప్రజల కోసం ఎమ్మెల్యే గా.. పాప కోసం తల్లిగా ఆమెతో పాటు తండ్రి, అమ్మమ్మలు ఇష్టంలోను కష్టం భరిస్తున్నారు. ఒక్కోసారి వాట్స్అప్ వీడియో కాల్ చేసి అమ్మ ను చూపిస్తూ పాపను లాలిస్తున్నారు. గుక్కపట్టి రోధిస్తున్న ఆ చిన్నారిని చూస్తూ కుటుంబ సభ్యులు ఆ చిన్నారి బాధను,ఏడుపును ఆపలేక పోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
