National Alliances: ఓవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ కూటమి కూర్పులో బిజీ బిజీ.. మణిపుర్ వ్యవహారం తేలితే మరింత క్లారిటీ

సింగిల్ డిజిట్ సభ్యులు కూడా పార్లమెంటులో లేని చిన్నా చితకా పార్టీలను కూడగట్టడం ద్వారా బీజేపీ ఏం సాధిస్తుందన్న అంశం కూడా ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

National Alliances: ఓవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ కూటమి కూర్పులో బిజీ బిజీ.. మణిపుర్ వ్యవహారం తేలితే మరింత క్లారిటీ
National Politics
Follow us
Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Updated on: Jul 25, 2023 | 4:50 PM

ఇండియా పేరిట బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఒక్కతాటి మీదికి తీసుకురావడంలో మోదీ వ్యతిరేకులు బిజీగా వున్నారు. పాట్నాలో తొలి భేటీ.. బెంగళూరులో మలి భేటీ నిర్వహించి.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత ముంబైలో మూడో భేటీ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తమ కూటమికి ఇండియా (I.N.D.I.A.) అనే అబ్రివేషన్ వచ్చేలా కొత్త కూటమికి కాంగ్రెస్ సారథ్యంలోని 26 రాజకీయ పార్టీలు నామకరణం చేసుకున్నాయి. ప్రతిపక్షాలను ఓడించడమంటే ఇండియాని ఓడించడమేనన్న ప్రచారాన్ని జనంలోకి తీసుకువెళ్ళందుకు సమాయత్తమవుతున్నాయి. అటు కొత్త కూటమికి నామకరణం జరిగిందో లేదో ఇటు కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల అధికార ప్రతినిధులు I.N.D.I.A. అంటే ఇండియా … ఇండియా అంటే I.N.D.I.A. అన్న ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా మొదలు పెట్టేశారు కూడా. దీనిని కౌంటర్ చేసేందుకు బీజేపీ నేతలు వచ్చే ఎన్నికలను I.N.D.I.A. వర్సెస్ భారత్ అన్న ధోరణికి మళ్ళించారు. జాతీయ వాదాన్ని ఓన్ చేసుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. బీజేపీ మొదట్నించి జాతీయవాదం ఆధారంగానే రాజకీయం చేస్తుండగా.. అదే ఆ పార్టీ ఆయువుపట్టుగా వుందన్న అంశాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో దాన్ని టార్గెట్ చేసేలా తమ కూటమికి I.N.D.I.A. అనే పేరును ఎంచుకుంది. ఇప్పటికిప్పుడు కూటమి బలాబలాలను బేరీజు వేయడం సరికాదు కానీ.. కూటమిల్లో వున్న పార్టీల నెంబర్‌ని, ఆ పార్టీలకున్న ఎంపీల సంఖ్యను చూస్తే ఎన్డీయేని బలంగా కనిపిస్తోంది. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్‌లో మొత్తం 36 రాజకీయ పార్టీలున్నాయి. ఇటు కొత్త కూటమి I.N.D.I.A.లో 26 పార్టీలే వున్నాయి. అయితే ఎన్డీయేలో దాదాపు 11 పార్టీలకు లోక్‌సభ సభ్యులే లేరు. కానీ I.N.D.I.A.లో వున్న పార్టీలన్నింటికీ ఎంపీలుండడం విశేషం. సింగిల్ డిజిట్ సభ్యులు కూడా పార్లమెంటులో లేని చిన్నా చితకా పార్టీలను కూడగట్టడం ద్వారా బీజేపీ ఏం సాధిస్తుందన్న అంశం కూడా ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే చిన్న పార్టీలు కీలకంగా మారతాయని కాబోలు బీజేపీ చిన్న పార్టీలను అక్కున చేర్చుకుంటుందంటున్నారు విశ్లేషకులు. కొత్త మిత్రులతోపాటు పాత మిత్రులను కూడా తమ కూటమిలో చేర్చుకుంటోంది బీజేపీ. గతంలో ఎన్డీయేలో కొనసాగి… వివిధ కారణాలతో కూటమిని వీడిన పాత మిత్రులను బీజేపీ అప్రోచ్ అవుతోంది. బీహార్ రాష్ట్రానికి చెందిన చిరాగ్ పాశ్వాన్, జితన్ మాంఝీలతోపాటు ఆ రాష్ట్రానికి చెందిన చిన్న పార్టీలను ఎన్డీయేలోకి ఆహ్వానించింది. దాంతో వారు జులై 18న న్యూఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే కూటమి భేటీకి హాజరయ్యారు. చాలా కాలంగా ప్రధాన మంత్రి మోదీకి సానుకూలంగా మాట్లాడుతున్న మాజీ ప్రధాని దేవెగౌడను, ఆయన పార్టీకి సారథ్యం వహిస్తున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని కూడా ఎన్డీయేలోకి రప్పించేందుకు కమలనాథులు యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. దేవెగౌడ ఆల్ రెడీ దారిలో పడినా.. కుమార స్వామి, ఆయన అనుచర గణం ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవడంలో తటపటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. యుపీలోని బీఎస్పీ చీలక వర్గం సుహెల్ దేవ్ బీఎస్పీని, అస్సాంలో ఒకప్పటి మిత్ర పక్షం అసొం గణ పరిషత్‌ని ఎన్డీయేలోకి రప్పించుకుంది బీజేపీ. తమిళనాడు విషయంలో బీజేపీ ప్లాన్ కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు తమిళనాడులో అన్నామలై సారథ్యంలో బీజేపీ రాష్ట్ర యూనిట్‌ని యాక్టివ్ చేస్తూనే మిత్ర పక్షమైన అన్నా డిఎంకేకు తగిన ప్రాధాన్యమిస్తోంది బీజేపీ అధిష్టానం. జులై 18న జరిగిన ఎన్డీయే భేటీలో అన్నా డిఎంకే సారథి పన్నీరు సెల్వానికి ప్రధాని పెద్ద పీట వేయడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అన్ని రాష్ట్రాలు ఏమో గానీ ఆంధ్ర ప్రదేశ్ విషయంలో బీజేపీ కాస్త అయోమయంగా కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం జనసేన పార్టీతో బీజేపీ మిత్రత్వం నెరుపుతోంది. రెండు నెలల క్రితం ఉన్నట్లుండి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు న్యూఢిల్లీ వెళ్ళి హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఉమ్మడిగా భేటీ అయి వచ్చారు. అప్పట్నించి టీడీపీ ఎన్డీయేలోకి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. కానీ గత రెండు నెలలుగా ఈ దిశగా అడుగులు పడలేదు. సరికదా జులై 18నాటి ఎన్డీయే భేటీకి చంద్రబాబుకు ఆహ్వానం రాలేదు. కానీ ఈ భేటీకి వెళ్ళిన పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి.. బీజేపీ అగ్రనేతలందరినీ కలిశారు. ఏపీలో మూడు పార్టీల కలయిక అవసరాన్ని పవన్ కల్యాణ్ బీజేపీ నేతలకు కాస్త గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఏపీ నుంచి బీజేపీకి ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా లేరు. 2014లో జరిగిన  సాధారణ ఎన్నికల్లో ఏపీలో రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. 2019 నాటికి ఏపీలో బీజేపీది ఒంటరి పోరు కావడంతో ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఇపుడు పవన్ కల్యాణ్ ప్రతిపాదిస్తున్నట్లుగా టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా బరిలోకి దిగితే ఏపీలో ఎన్నో కొన్ని సీట్లను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ చంద్రబాబుతో కలిసి 2,3 ఎంపీ సీట్లను దక్కించుకునే ఆసక్తి కమలనాథుల్లో పెద్దగా లేనట్లు ఢిల్లీ వర్గాలంటున్నాయి. టీడీపీకి ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక బీజేపీకి రెండో ఆలోచన వుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీని ఎన్డీయేలోకి రప్పించేందుకు బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు వారు చెప్పుకుంటున్నారు. గత నెలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు అమిత్ షా నేరుగా ఎన్డీయేలోకి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అంశాల వారీగా బయట్నించి మద్దతు ఇవ్వడానికే జగన్ మొగ్గు చూపారని, అందుకే ఎన్డీయేలో చేరడం లేదని తెలుస్తోంది. బయట్నించి లభించే భారీ మద్దతా? లేక తాము పొత్తు కారణంగా దక్కించుకునే స్వల్ప నెంబరా అన్నది కమలనాథులు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కంటే జగన్నే బీజేపీ పెద్దలు విశ్వసనీయ మిత్రునిగా భావిస్తున్నారని జాతీయ రాజకీయాలను తరచూ విశ్లేషించే ఓ సీనియర్ జర్నలిస్టు చెబుతూ వుండడం విశేషం.

మహారాష్ట్రలో బీజేపీకిపుడు తిరుగు లేదని చెప్పుకోవాలి. 2019లో శివసేనతో కలిసి భారీ స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఆ తర్వాత మరాఠా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. చిరకాలంగా ఎన్డీయేలో కొనసాగిన శివసేన.. బీజేపీతో తెగదెంపులు చేసుకుని దశాబ్దాల కాలం ద్వేషించిన కాంగ్రెస్ పార్టీ పంచన చేరిపోయింది. ఇపుడు శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ వర్గంతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. కర్నాటకలో దేవెగౌడ పార్టీ జేడీఎస్ గనక ఎన్డీయేతో కలిస్తే కాస్త మెరుగైన సీట్లను దక్కించుకుంటామని బీజేపీ భావిస్తోంది. కేరళ, తమిళనాడుల్లోను ఈసారి మెరుగైన ఫలితాలొస్తాయని ఆశిస్తోంది. అయితే, ఎన్డీయేను బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి సారించడానికి కారణం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలేనని చెప్పుకోవాలి. నిజానికి 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ తమ కూటమిలోని చిన్నా చితకా పార్టీలను పట్టించుకోలేదు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయేని వీడిన శిరోమణి అకాలీదళ్‌ని కనీసం బుజ్జగించే ప్రయత్నమూ చేయలేదు. కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఒక్కతాటి మీదికి తెచ్చే ప్రయత్నాలను ఎన్నికలకు చాలా ముందుగానే ప్రారంభించడంతో బీజేపీ కూడ అప్రమత్తమైంది. పాట్నా భేటీ ముగిసిన తర్వాత సైలెంట్‌గా పని ప్రారంభించిన బీజేపీ.. కాంగ్రెస్ కూటమి బెంగళూరు భేటీకి సిద్దమయ్యే సరికి న్యూఢిల్లీలో ఎన్డీయే మిత్ర పక్షాలను ఒక్క ప్లేస్‌లో కూర్చోబెట్టగలిగింది. ఎన్డీయేని బలోపేతం చేయడంలో బీజేపీ, కొత్త కూటమి విధివిధానాలను రూపొందించడంలో కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఫోకస్ చేశాయి. అయితే, మణిపుర్ వ్యవహారం ఇపుడు రెండు పార్టీల కూటమి కూర్పులకు కాస్త బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!