Electric Bike Fire: ఎలక్ట్రిక్ బైక్ ట్రెండ్ అని కొన్నాడు.. రయ్ రయ్ అని నడిరోడ్డుపై పోతుంటే చెలరేగిన మంటలు

నడుస్తున్న యాక్టీవా బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే?

Electric Bike Fire: ఎలక్ట్రిక్ బైక్ ట్రెండ్ అని కొన్నాడు.. రయ్ రయ్ అని నడిరోడ్డుపై పోతుంటే చెలరేగిన మంటలు
Fire Accident In Activa Bike
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 08, 2024 | 3:18 PM

ఇది ఎలక్ట్రిక్ బైకుల కాలం.. పెట్రోలు ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతుండడంతో అందరూ ఎలక్ట్రిక్ బైకులను కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా పెద్ద సమస్యగా మారింది. పెట్రోల్‌కి పెట్టే డబ్బులు ఎందుకు దండగ చేసుకోవడం అని భావించి ఎలక్ట్రిక్ బైకులు కొంటుంటే వాటి వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న ఘటనలు మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఈఎంఐలు కట్టుకుని మరీ బైకులు కొనుక్కుంటే అవి కాస్తా ప్రమాదాల బారిన పడేసి ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఇక్కడ కూడా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. నడుస్తున్న యాక్టివా బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ వాహనదారుడికి ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేశాడు.

పాదాలకంటి లక్ష్మణ్ అనే వ్యక్తి వృత్తి రీత్యా జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. ఎప్పటిలాగే ఈరోజు కూడా మధ్యాహ్నం తన విధులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఉప్పుగూడ రైల్వే బ్రిడ్జ్ క్రిందికి రాగానే తాను నడుపుతున్న యాక్టివా బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా బండి దిగిపోయాడు. ముందు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత తేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అప్పటికే భారీగా చెలరేగిన మంటలకు బండి పూర్తిగా దగ్ధం అయింది. అక్కడే ఉన్న స్థానికులు అతనికి సాయం చేయాలని ప్రయత్నించినా బండి మాత్రం తిరిగి అతనికి దక్కలేదు. దీంతో స్థానికులతో కలిసి లక్ష్మణ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

అయితే.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. కొన్ని వాహనాల కంపెనీలు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటివి ఎదురవుతున్నాయని అనుకోవచ్చు. అయితే ఇందులో తమ తప్పిదం లేదని సదరు వాహనాల కంపెనీలు కూడా చేతులు దులుపుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు మంచి స్టాండర్డ్స్ మెయింటెన్ చేస్తున్నప్పటికీ.. కొన్ని మాత్రం తూతూ మంత్రంగా సర్వీసులు అందిస్తున్నాయనే మాట ఒప్పుకోవాల్సిందే. తాజాగా జరిగిన ఈ ఘటనలో కూడా అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై ఆలోచనలు చేయాల్సిందే. నడిరోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలాంటివి జరిగితే వాహనదారుడితో పాటు మిగతా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి