Telangana: ప్రజా ప్రతినిధులకు వార్నింగ్ లెటర్స్ పంపిన మావోయుస్టులు.. తీరు మార్చుకోవాలంటూ..
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మావోయుస్టుల వార్నింగ్ లెటర్స్ కలకలం రేపుతున్నాయి. జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరిట లేఖలు అందడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ప్రజాప్రతినిధులకు హెచ్చరిక లేఖలు పంపారు..
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మావోయుస్టుల వార్నింగ్ లెటర్స్ కలకలం రేపుతున్నాయి. జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరిట లేఖలు అందడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ప్రజాప్రతినిధులకు హెచ్చరిక లేఖలు పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మావోయుస్టుల పేరుతో పోస్టులో వచ్చిన లేఖలు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో బీర్‌పూర్ వాసుల్లో ఆందోళన నెలకొంది.
జగిత్యాల జిల్లాలో ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరిట రాసిన లేఖలు శనివారం పోస్టులో వచ్చాయి. జిల్లాలోని బీర్పూర్ మండల సర్పంచులు, ఎంపిపి, నరసింహుల పల్లి ఎంపిటీసీ, పలువురు ముఖ్య నాయకులతో కలిపి మొత్తం 28 మందికి మావోయిస్టుల పేరుతో ఈ లేఖలు రాశారు. అయితే మండలంలోని కొందరు నేతలు అటవీ భూములను కబ్జా చేసి అమ్ముకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
అలాంటి ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, లేకపోతే ప్రజా కోర్టులో శిక్షతప్పదని, వారిని హతమారుస్తామంటూ లేఖలో హెచ్చరించారు. జగ్దళ్‌పూర్ జిల్లా ఏరియా కమిటీ అని లెటర్ హెడ్స్‌పై ముద్రించి ఉంది. గోదావరి బెల్ట్ ఏరియా మావోయుస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరుతో ఈ లేఖలు చేరాయి. అయితే రాజకీయ నాయకులతో పాటు మండలంలోని ఓ ప్రభుత్వ అధికారికి కూడా లేఖలు అందినట్టు తెలుస్తోంది.
నిజానికి నక్సల్స్ కదలికలు పెద్దగా లేని జగిత్యాల జిల్లాలో మావోయుస్టుల లేఖలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆందోళనలో పడ్డారు. అయితే నిజమైన మావోయిస్టు లే లేఖలు పంపారా లేక ఇది ఆకతాయిల నిర్వాకమా అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి. లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయో నిగ్గుతేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..