Congress Majority: నల్గొండలో కాంగ్రెస్ సునామీ.. ఎంపీగా రఘువీర్ రెడ్డి రికార్డు మెజారిటీ..!
తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ప్రభంజనం సృష్టించారు. రాజకీయ దిగ్గజం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకుగా ఎన్నికల బరిలోకి దిగిన రఘువీర్ రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.59 లక్షల మెజార్టీతో గెలుపు బావుటా ఎగరేసి.. రికార్డు సృష్టించారు. తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ ఖావటం విశేషం.
తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ప్రభంజనం సృష్టించారు. రాజకీయ దిగ్గజం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకుగా ఎన్నికల బరిలోకి దిగిన రఘువీర్ రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.59 లక్షల మెజార్టీతో గెలుపు బావుటా ఎగరేసి.. రికార్డు సృష్టించారు. తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ ఖావటం విశేషం.
నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోటగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పోటీ పడ్డారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో రఘువీర్ రెడ్డి ఏకపక్షంగా దూసుకుపోయారు.
రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ రికార్డ్..!
గతంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీ సాధించిన పార్లమెంటు సభ్యుడు పీవీ నర్సింహారావు రికార్డు ఉంది. ఇప్పటి వరకు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో మూడో వ్యక్తి కూడా ఆయనే. 1991లో కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీవీ 5.8 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై గెలుపొందారు. కాగా.. 2011లో కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 5.43 లక్షల మెజార్టీ సాధించగా.. ఇపుడు ఆయన రికార్డును రఘువీర్ రెడ్డి బ్రేక్ చేశారు. ప్రస్తుత సమాచారం ప్రకారం దేశంలో రికార్డు మెజారిటీ సాధించిన ఆరో ఎంపీగా రఘువీర్ రెడ్డి ఉన్నారు.
నల్గొండ జిల్లా గతంలో ద్విసభ్య నియోజవర్గంగానే ఉండేది. ఇక్కడ రావినారాయణ రెడ్డితో పాటు పోటీ చేసిన, సుకం అచ్చాలు విజయం సాధించారు. ఇద్దరూ పీడీఎఫ్ అభ్యర్థులే. 1952 మార్చి 27 పోలింగ్ జరిగింది. రావి నారాయణ రెడ్డికి 3,09,162 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి పీ.భాస్కర్ రావుపై 2,22,280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కమ్‌జౌన్‌పూర్(పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు 2,33,571 ఓట్లు పోలయ్యాయి. అయితే తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పొందిన ఎంపీతో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని అప్పట్లో నిర్ణయించారు. దాంతో, నెహ్రూ కంటే అధిక ఓట్లు సాధించిన రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ప్రారంభమైంది.
నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గం విషయానికి వస్తే,, ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గెలుపుతో మరోసారి కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ నల్గొండలో ఇప్పటి వరకు 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన బోణి చేయలేకపోయింది. 2014 ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ 2019 లో మాత్రం రెండో స్థానానికి చేరుకుంది. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి రికార్డు మెజారిటీ సాధించడంతో బిజెపి, బీఆరేస్ లు డిపాజిట్ లను కూడా దక్కించుకోలేక పోయాయి.
నల్లగొండ కాంగ్రెస్ కు పెట్టని కోట..
నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి విజయాల రికార్డ్ ఉంది. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియోజక వర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. అయినా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇదే పరిస్థితి ఈసారి భిన్నంగా పునరావృతమైంది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో సూర్యాపేటలో మినహా.. మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నల్గొండ పార్లమెంటు పోరులో వార్ వన్ సైడ్ లా ఉంటుందని తొలి నుంచి ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మెజారిటీ కోసం పోటీ పడుతున్నామని ఎన్నికల సమయంలో పలు సార్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏమాత్రం పోటీ నివ్వలేకపోయింది. నల్గొండ పార్లమెంటు నియోజక వర్గంలో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ సూపర్ విక్టరీ కొట్టేసింది.
కుందూరు బ్రదర్స్…
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ గా వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేరుంది. నల్లగొండ ఎంపీగా రఘువీర్ రెడ్డి ఎన్నికతో జిల్లా కాంగ్రెస్ లో మరో బ్రదర్స్ వచ్చినట్లయింది. జనారెడ్డి చిన్న కుమారుడు కుందూరు జయవీర్ రెడ్డి కూడా 2023 శాసనసభ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి కుందూరు జానారెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా జయవీర్., ఎంపీగా రఘువీర్ రెడ్డిలు గెలుపొందారు. దీంతో ఈ బ్రదర్స్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కుందూరు బ్రదర్స్ గా అడుగుపెట్టబోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..