Gold: వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..? వార్ ఎఫెక్ట్.. సామాన్యులకు గట్టి షాక్..
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావంతో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కేవలం ఒక్కరోజులోనే బంగారం ఏకంగా రూ.7 వేలకు పైగా పెరిగితే, వెండి రూ.25 వేల దాకా ఎగిసిపడింది! మరి రాబోయే రోజుల్లో ధరలు ఏ స్థాయికి చేరుతాయో తెలుసుకుందాం..

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్ అణు కర్మాగారాలను నాశనం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం, దానికి ప్రతిగా ఇరాన్ అమెరికా స్థావరాలపై దాడులు చేయడం వల్ల పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఈ యుద్ధ వాతావరణం ప్రభావం నేరుగా మన దేశ కమోడిటీ మార్కెట్‌పై పడనుంది.
బంగారం ధర పైపైకి..
యుద్ధం ఇలాగే కొనసాగితే, బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్టాలను తాకవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా అంచనా ప్రకారం.. మార్చి ప్రారంభంలో బంగారం ధర ప్రస్తుత స్థాయి నుండి 15శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే రూ.23వేల నుంచి రూ.25 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా ప్రకారం.. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధరలో 10శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు.
వెండి ధర ఊహంచని విధంగా..
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. అజయ్ కేడియా అంచనా ప్రకారం.. వెండి ధర రూ.3.50 లక్షలకు చేరుకోవచ్చు. అనుజ్ గుప్తా ప్రకారం.. వెండి ధర ప్రస్తుత స్థాయి కంటే రూ.20,000 నుండి రూ.40,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా యుద్ధం ఎంతకాలం కొనసాగితే, ధరల పెరుగుదల అంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత గరిష్ట స్థాయిలను దాటి వెండి ధర రూ.4.20 లక్షలకు చేరిన ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. పెట్టుబడిదారులు మార్కెట్ హెచ్చుతగ్గులను జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు.
ప్రస్తుత ధరల పరిస్థితి
కాగా శనివారం బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి పసిడి ప్రియులకు గట్టి షాక్ ఇచ్చాయి. సాయంత్రం 4గంటల సమయానికి బంగారం ఏకంగా రూ.7వేలకు పైగా పెరిగి రూ.1,68,710కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రూ.6,550 పెరిగి రూ.1,54,650కి చేరుకుంది. వెండి ధరలు అమాంతం రూ.25,000 పెరిగి రూ.3,20,000కి చేరుకుంది.
