Telangana: అగ్ని ప్రమాదమే ఆ బడికి జీవం పోసింది.. కార్పోరేట్ స్కూల్‌ను మించి అద్భుతంగా..
ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యింది. వేలాది విద్యార్థుల భవిష్యత్ కు బాటలు వేసిన స్కూల్ అగ్ని కీలకల్లో కలిసిపోవడంతో పూర్వ విద్యార్థి ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు .. ఆ స్కూల్ ని పునర్నిర్మించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాల లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించింది. కొత్త భవనం ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడి.. విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తోంది. ఈ స్కూల్ పునర్నిర్మాణం విద్యారంగానికి అంకితమైన ఒక వ్యక్తి కృషికి నిదర్శనం.

ఆ పాఠశాల లక్షాలాది మంది పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. తన బడిలో విద్యాబుద్దులు నేర్చుకున్న విద్యార్థులను ఇంజనీర్లు , డాక్టర్లు, యాక్టర్లు , జర్నలిస్ట్ లు, ఎమ్మెల్యే లుగా మలిచింది. ప్రభుత్వాల పట్టింపు లేని తనంతో శిథిలావస్థకు చేరింది. అనుకోని అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైంది. అంతే ఆ ప్రమాదంతో వేలాది మంది తీపి గుర్తులు అగ్ని కిలల్లో కలిసిపోయినా.. కాలిపోయిన బడి అంతలోనే కూలిపోయింది. ఆ ఘటనతో అంతా ఆవేదన చెందారు. ఇక్కడ మా బడి ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందేమోనని పూర్వ విద్యార్థులంతా ఆందోళన చెందారు. కానీ ఆ అగ్ని ప్రమాదమే ఆ బడి భవిష్యత్ ను మార్చింది. ఆ బడిలో పాఠాలు నేర్చుకున్న ఓ పూర్వ విద్యార్థి తన పాఠశాల రూపు రేఖలేమార్చేశాడు. తను చదివిన బడి గుడిలా నిండు నూరేళ్లు కలకాలాడలని తలిచాడు. ఆయన ఆకాంక్షలతో ఇప్పుడా ప్రభుత్వ బడి నూతన ఉత్సాహంతో మరో వందేళ్లు సేవలందించేందుకు రెడీ అంటోంది. కూలిన చోటే గెలిచి నిలిచేందుకు సిద్దమైన ఆ బడి కథ ఏంటో తెలుసుకోవాలంటే మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట కు వెళ్లాల్సిందే.
లక్షేట్టిపేట మండల కేంద్రం ఒకప్పటి నియోజక వర్గ కేంద్రం. 1964లో ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసింది అప్పటి సర్కార్. 10 మంది విద్యార్థులతో తొలి తరగతి ప్రారంభమైంది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అనతి కాలంలోనే గుర్తింపును పొంది.. ఉన్నత పాఠశాల నుంచి కళాశాలగా మార్పు చెందింది. 1969లో లక్షేట్టిపేట తాలూకాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలగా ఉన్నతీకరించింది ఆనాటి ప్రభుత్వం. ఆ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు పూర్వ కరీంనగర్ జిల్లాలోని వెల్గటూర్, ధర్మపురి , ధర్మారం మండలాల నుంచి సైతం విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. 60 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన ఈ పాఠశాల లక్షాలాది మంది విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పింది. వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో జనం మెచ్చిన ప్రజా నేతలు రాటు తేలగా.. ఇంజనీర్లుగా , డాక్టర్లు గా వందలాది మంది తయారయ్యారు.
పేదల పెద్ద బడిగా గుర్తింపు పొందిన ఈ ప్రభుత్వ పాఠశాల కాలగమనంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మత్తులకు నోచుకోక శిథిలావస్థకు చేరింది. 60 ఏళ్ల సంబరాలకు సిద్దమైన వేళ అనుకోని అగ్ని ప్రమాదానికి గురై పాఠశాలలోని లైబ్రరీ కాలిబూడిదైంది. అలా కాలిపోయిన బడి ఇక కాలచక్రంలో కనుమరుగైపోద్దని అంతా భావించారు. అయితే 1973-74 లో ఇక్కడ పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థి తన పాఠశాల అలా చరిత్ర పుటలోకి ఎక్కకూడదని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా శిథిలావస్థకు చేరిన బడిని బాగు చేసేందుకు రంగంలోకి దిగాడు. ఆయన మంచిర్యాల నియోజక వర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు. 10 కోట్ల నిధులను వెచ్చించి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో ఇప్పుడు కొత్తగా మళ్లీ పురుడు పోసుకుంది లక్షేట్టిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. తన శిష్యుడు నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అగ్ని ప్రమాదానికి గురై ఓ రకంగా అదృష్టానికి నోచుకుంది ఈ ఆరు దశాబ్దాల పాఠశాల. అలా కాలిబూడిదై ఇదిగో ఇలా నూతన ఉత్సహాంతో కార్పోరేట్ కి దీటుగా కొత్త శొభగులతో సిద్దమైంది.
2023 డిసెంబర్‌లో పాఠశాల అగ్నిప్రమాదం జరిగి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రమాదంతో చలించిపోయిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు.. తనకు విద్యాబుద్దులు నేర్పిన పాఠశాల ను తిరిగి నిలబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి.. పాఠశాలకు 12 గదులు, కళాశాలకు 16 గదులతో కలిపి మొత్తం 28 గదులతో రెండు అంతస్తుల్లో కార్పొరేటు స్థాయిలో అన్ని హంగులతో భవనాలను నిర్మించారు. రూ. కోటి వెచ్చించి విద్యార్థులకు ఫర్నిచర్, ల్యాబ్ సౌకర్యాలను కల్పించారు. ఆహ్లాదంగా ఉండేందుకు రూ.20 లక్ష లతో ప్రాంగణమంతా మొక్కలు నాటించి పచ్చదనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏడాది వ్యవధిలోనే కార్పొరేటుకు దీటుగా భవనాలను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు. శరవేగంగా పనులు పూర్తి చేసుకున్న లక్షేట్టిపేట ప్రభుత్వ పాఠశాల రేపు జూన్ 12 న పునః ప్రారంభానికి సిద్దమైంది. పూర్వ విద్యార్థులందరికి పునః ప్రారంభ ఆహ్వానం పంపుతోంది. సకుటుంబ సమేతంగా ఇంటి పండుగగా నా పునః ప్రారంభ వేడుకకు రావాలని ఆహ్వానిస్తోంది లక్షేట్టిపేట ప్రభుత్వ బడి. బడి చల్లగుంటేనే బతుకు పచ్చగా ఉండేంది భవిష్యత్ బంగారమయ్యేది అంటోంది లక్షేట్టిపేట సర్కారు బడి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..