Karimnagar Politics: కరీంనగర్‌లో కాంగ్రెస్ పూర్వవైభవం సాధిస్తుందా.. బీజేపీ, బీఆర్ఎస్ ధీటుగా నిలిచేదెవరూ..?
కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గ బాధ్యతలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పారు. ఇక్కడ 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తరువాత వరుసగా కాంగ్రెస్ ఓడిపోతూ వస్తుంది. అయితే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలం మెల్ల మెల్లగా పుంజుకుంటూ వచ్చింది. ఇప్పుడు బీజేపీతో పాటు, బీఆర్ఎస్‌ను ఎదుర్కొని పని చేయాల్సి వస్తుంది.
కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గ బాధ్యతలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పారు. ఇక్కడ 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తరువాత వరుసగా కాంగ్రెస్ ఓడిపోతూ వస్తుంది. అయితే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలం మెల్ల మెల్లగా పుంజుకుంటూ వచ్చింది. ఇప్పుడు బీజేపీతో పాటు, బీఆర్ఎస్‌ను ఎదుర్కొని పని చేయాల్సి వస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు మంత్రి… పొన్నం ప్రభాకర్‌కు తొలి పరీక్షగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
కరీంనగర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడి నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ చేసి, తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. అంతేకాదు, ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఆదిరించారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్ బలహీనపడుతూ వచ్చింది. మొన్న జరిగిన ఆసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కోల్పోయింది. అటు బీజేపీ తమ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. ఇటు బీజేపీని, అటు బీఆర్ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇక ఇక్కడ నుంచి బీజేపీ తరుఫున బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ మరోసారి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో స్పష్టత రాలేదు. అయితే హుస్నాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ పార్లమెంట్ బాధ్యతలు అప్పజెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానికి పరిమితమైంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో కరీంనగర్ పార్లమెంటు స్థానంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మంత్రి పాన్నం ప్రభాకర్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. అయితే, బలమైన అభ్యర్థి కోసం దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు. వెలిచాల రాజేందర్ రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్‌ను ఎదురుకోవాలంటే, బలమైన నేత కావాలి.
ఇదిలావుంటే సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరుఫున వినోద్ కుమార్ కూడా ప్రచారం మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కరీంనగర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితమైంది. ఇక్కడ ఆధిక ఓట్లు ఉన్నాయి.. సుమారుగా.. మూడు లక్షల 50 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతేకాదు, కరీంనగర్ అసెంబ్లీ స్థానంపై మరింత దృష్టి పెడుతున్నారు. ఇక్కడ ఇతర పార్టీల చెందిన నేతలను, పార్టీలో చేర్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెసు ఇప్పుడు మొదటి స్థానంలోకి తీసుకోవరావాలని భావిస్తున్నారు.
అయితే, తమకు బీజేపీతో మాత్రమే పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంటుందనే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో బీజేపీని టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజయ్ ఒక్క రూపాయి పని కూడా చేయలేదని మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే విధంగా బండి సంజయ్, వినోద్ కుమార్ ఒక్కటే అంటూ ధ్యజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పొన్నం స్పష్టం చేశారు.
ఇక, సంక్రాంతి తరువాత కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలు పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి, కరీంనగర్ పార్లమెంట్ స్థానం అన్ని పార్టీలకు కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…