Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు.. కారణం ఏంటంటే..!

గురుకులాల్లో సమస్యలు విద్యార్థులను అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆహార కల్తీ తో ఆస్పత్రి పాలైన విద్యార్థులు... ఇప్పుడు ఉపాధ్యాయులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ రోడ్డెక్కారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు.. కారణం ఏంటంటే..!
Gurukul Students
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 26, 2024 | 5:30 PM

జోగుళాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన సంచలనంగా మారింది. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్‌ ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ సుధీర్ఘ నిరసన ర్యాలీ చేపట్టారు. బిచుపల్లిలోని గురుకులం నుంచి గద్వాల్ జిల్లా కలెక్టరేట్ కు వరకు ఏకంగా 20కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. జిల్లా కలెక్టర్ సంతోష్ ను కలిసి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నాడని… మాకు ఈ ప్రిన్సిపల్ వద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్దేశ్య పూర్వకంగానే తమని వేధిస్తున్నాడని విన్నవించారు.

బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు విద్యార్థులు ఉన్నారు. సుమారు 620మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు ప్రిన్సిపల్ పై ఫిర్యాదు చేశారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే టార్గెట్ చేసి కొడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థులను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులపై సైతం అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని చెబుతున్నారు. ఎదురుతిరిగి విద్యార్థులను సస్పెండ్ చేసి ఆ సీట్లను కొత్తవారికి అమ్మేస్తున్నడని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన జిల్లా కలెక్టర్ వారికి భరోసా కల్పించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అయితే విద్యార్థులు హాస్టల్ కి వెళ్లేందుకు మాత్రం నిరాకరించారు. ప్రస్తుత ప్రిన్సిపల్ విధుల్లో ఉంటే తమపై ఇంకా ఎక్కువ వేధింపులకు గురిచేస్తాడని కలక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో ప్రిన్సిపల్ విధుల్లో ఉండడని హామీ ఇవ్వడంతో పాఠశాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక ప్రిన్సిపల్ వ్యవహారాన్ని అటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థులు. వెంటనే అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులను ప్రత్యేక వాహనాల్లో గురుకులం వద్దకు పంపించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు:

చదువు మీద దృష్టి పెట్టకుండా ఉంటున్న విద్యార్థులను గట్టిగా మందలించినప్పడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్‌ చెబుతున్నారు. విద్యార్థులు ఉద్దేశ్యపూర్వకంగా తనని టార్గెట్ చేశారని ఆరోపోస్తున్నారు. ఇక విద్యార్థుల నిరసన ర్యాలీ తీవ్ర దుమారం రేపడంతో మొత్తం వ్యవహారంపై విచారణకు జిల్లా కలెక్టర్‌ సంతోష్‌ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గురుకుల పాఠశాలల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు త్రిసభ్య కమిటీ బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల లేవనెత్తిన అంశాలపై విచారణ చేయనుంది. నివేదిక అనంతరం జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి