Hyderabad: గంజాయి మత్తులో అర్ధరాత్రి యువకుల వీరంగం.. పోలీసు వాహనం పైకి ఎక్కి హంగామా
గంజాయి మత్తులో యువకులు హల్‌చల్ చేశారు. మత్తులో ఉన్న యువకులు పోలీసులను సైతం లెక్కచేయకుండా వారి వాహనంపైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు.
Hyderabad: తెలంగాణ రాజధాని…హైదరాబాద్ నగర యువత మత్తులో ఊగుతోంది. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా మత్తుగాళ్లకు కళ్లెం వేయలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ అసిఫ్‌నగర్‌లో అర్థరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర గంజాయి మత్తులో యువకులు హల్‌చల్ చేశారు. నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఐతే మత్తులో ఉన్న యువకులు పోలీసులను సైతం లెక్కచేయకుండా వారి వాహనంపైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు.
పోలీసు వాహనంతోపాటు ఇతర వాహనాల అద్దాలు పగులగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా..అజయ్ అనే యవకుడిని అసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..