Hyderabad: ర్యాష్ డ్రైవింగ్‌ చేయొద్దన్నందుకు వృద్ధుడిపై యువకుడు దాడి.. చికిత్స పొందుతూ పెద్దాయన మృతి

రోడ్డుపై బైక్ నెమ్మదిగా నడుపు నాయనా.. అని అడగడం ఆ యువకుడికి సుతారం నచ్చలేదు. దీంతో తన కంటే వయసులో పెద్దవాడని కూడా చూడకుండా వృద్ధుడిపై దాడి చేశాడు. దీంతో కింద పడిపోయిన వృద్ధుడి తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు..

Hyderabad: ర్యాష్ డ్రైవింగ్‌ చేయొద్దన్నందుకు వృద్ధుడిపై యువకుడు దాడి.. చికిత్స పొందుతూ పెద్దాయన మృతి
Young Man Attacked An Old Man
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Oct 17, 2024 | 6:11 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: అల్వాల్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై ర్యాష్ డ్రైవింగ్‌ చేస్తూ వెళుతున్న యువకుడిని ఆపిన వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. రోడ్డుపై బైక్‌పై రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకుడిని ఓ వృద్ధుడు ఆపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో యువకుడు వృద్ధుడిపై దాడి చేయడంతో.. ఆయన మరణించాడు. సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకెళ్తే..

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న ఆంజనేయులు అనే వృద్ధుడు తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పటికే, రోడ్డు మీద ట్రాఫిక్ ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు. అదే సమయంలో ఓ యువకుడు బైక్‌పై అత్యంత వేగంగా నడుపుతూ.. చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ర్యాష్ డ్రైవింగ్‌ చేయసాగాడు. దీంతో రోడ్డుపై ఇతర వాహనదారులు, పాదచారులు భయాందోళనలకు గురయ్యారు. అదే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆంజనేయులు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్న బైక్‌ను ఆపాడు. ఇదేంటని ప్రశ్నించిన వృద్ధుడితో బైక్‌ నడిపిన యువకుడు ఆంజనేయులుతో వాగ్వాదానికి దిగాడు. నెమ్మదిగా వెళ్ళమని, ఇలా డ్రైవ్‌ చేయడం ప్రమాదకరమని చెప్పడమే నేరమైంది. ఆంజనేయులు మాటలకు అసహనం చెందిన యువకుడు ‘నాకే ఎదురు చెపుతావా?’ అంటూ ఆంజనేయులపై దాడికి దిగాడు.

ఏమాత్రం వెనుకాడకుండా ఆంజనేయులపై దాడి చేయడంతో.. ఆంజనేయులు కింద పడి పోయాడు. ఆయన తలకు బలమైన గాయమవడంతో రక్తం కారుతూ ఉంటే చుట్టుపక్కన వారు కనీసం ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. కొద్ది సేపటి తర్వాత కొంతమంది ఆంజనేయులను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా మారింది. 2 రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఆంజనేయులిని కాపాడేందుకు ఆయన కుటుంబం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆంజనేయుల కుమారుడు తన తండ్రి మరణానికి కారణమైన యువకుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యువకుడిని గుర్తించి, పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో యువకుడు తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. యువకుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.