School Holiday: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఆ జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు.. కారణం ఇదే
దసరా సెలవులు ముగియడంతో అన్ని చోట్ల పాఠశాలలు తెరచుకున్నాయి. అయితే ఈ జిల్లాలోని పాఠశాలలకు మాత్రం రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని చోట్ల విద్యాసంస్థలు తిరిగి తెరచుకున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 14వ తేదీతో దసరా సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి బడులు ప్రారంభమయ్యాయి. భారీగా సెలువులు రావడంతో విద్యార్ధులు బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కుమ్రంలో తెలంగాణలో మరో జిల్లాలో గురువారం పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 17 (గురువారం) విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 17వ తేదీన ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ 84వ వర్ధంతి జరగనుంది. అడవి బిడ్డల హక్కులైన ‘జల్, జంగల్, జమీన్ (నీరు- అడవి- భూమి)’ కోసం విరోచితంగా పోరాడిన యోధుడు కొమురం భీం. ఆదివాసీల స్వయం పాలన కోసం ఆయన చేసిన జోడేఘాట్ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని జోడేఘాట్ కేంద్రంగా నిజాం పాలకులపై గెరిల్లా పోరాటాలకు దిగాడు భీమ్. తమ బ్రతుకులు మారాలంటే తమ ప్రాంతంలో పాలన తమదే అయి ఉండాలని నాటి నిజం పాలకులతో భీమ్ తెగేసి చెప్పాడు. భీంను నేరుగా ఎదుర్కోలేని నైజాం ప్రభుత్వం కొమరం భీమ్ వద్ద సన్నిహితంగా మెలిగే కుర్దు పటేల్‌తో కుట్రపన్ని వెన్నుపోటుతో కొమురం భీమ్‌పై దాడి చేసింది. జోడెఘాట్ ప్రాంతంలో నైజాం ఆర్మీ భారీ ఎత్తున మోహరించి, అన్నివైపులా చుట్టుముట్టి కొమరం భీంపై తూటాల వర్షం కురిపించింది. దీంతో 39 ఏళ్లకే 1940లో కొమరం భీం నేలరాలాడు. తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబులను ఎదురించిన కుమ్రం భీం దేశం గర్వించదగ్గ మహోయోధుడిగా తెలంగాణ ప్రజలు భావిస్తారు.
స్వయం పాలన ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన కుమ్రం భీం చరిత్రను భావిత తరాలకు అందించేందుకు గత ప్రభుత్వం హయాంలో అక్టోబర్ 17వ తేదీన కుమ్రంభీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా కుమురం భీం చరిత్రను పాఠ్యాంశాల్లో కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్టోబర్ 17న సెలవు ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ 9వ తేదీన పాఠశాలలు రెండో శనివారం సెలవు రద్దు చేసి, ఆ రోజును పని దినంగా నిర్ణయించింది.