IAS Officers: ‘వెంటనే వెళ్లిపోవాల్సిందే..’ ఆ ఐఏఎస్ ఆధికారులకు ‘క్యాట్’లో దక్కని ఊరట..
ఐదుగురు ఐఏఎస్‌లకు క్యాట్‌లో ఊరట దక్కలేదు. దీంతో వారు క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నారు..
హైదరాబాద్, అక్టోబర్ 15: IASల పిటిషన్‌పై క్యాట్‌లో వాదనలు ముగిశాయి. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించిన ఐదుగురు IASలకు క్యాట్‌లో ఊరట దక్కలేదు. ఐఏఎస్‌ల పిటిషన్‌పై విచారణలో క్యాట్ ప్రశ్నాస్త్రాలు సంధించింది. విజయవాడలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. సేవ చేయడానికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీసింది. సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరా? ఇంట్లో కూర్చొని సేవ చేస్తామంటే ఎలా? 1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు? అంటూ క్యాట్ ప్రశ్నించింది. గైడ్‌లైన్స్‌లో జూనియర్, సీనియర్ తేడా లేకుండా.. స్వాపింగ్ చేసుకునే వీలుందని IAS కౌన్సిల్ వాదనలు వినిపించింది. అనంతరం డీవోపీటీ ఆదేశాలు పాటించాలని క్యాట్ తీర్పు ఇచ్చింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐఏఎస్‌ల పిటిషన్లపై క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. దీంతో ఐదుగురు ఐఏఎస్‌లకు క్యాట్‌లో ఊరట లభించలేదు.
DOPT ఉత్తర్వులు రద్దు చేయాలని క్యాట్‌ను ఐఏఎస్‌లు ఆశ్రయించగా.. ఒక్కో పిటిషన్‌పై క్యాట్ వేర్వేరుగా వాదనలు విన్నది. క్యాట్ తీర్పుపై రేపు రాష్ట్ర హైకోర్టుకు ఐఏఎస్‌లు వెళ్లనున్నారు. హైకోర్టులో వారు లంచ్ మోషన్ దాఖలు చేయనున్నారు.
కాగా తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఏపీకి వెళ్లాలని, అలాగే అక్కడ పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్ అధికారులు తెలంగాణకు వెళ్లాలని డీవోపీటీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారంతా ఆయా రాష్ట్రాల్లో అక్టోబర్ 16లోపు రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే డీవోపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్‌లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూలన్ (క్యాట్)ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి సృజన, రోనాల్డ్ రోజ్.. ఐదుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లలో కోరారు. వీరి పిటిషన్లపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ మంగళవారం విచారణ జరపి ఐదుగురు ఐఏఎస్‌ల అభ్యర్ధనను తోసిపుచ్చింది. వెంటనే డీవోపీటీ ఉత్తర్వుల మేరకు వారందరినీ ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని ఆదేశించింది.