Domestic Violence: పుట్టింటి నుంచి రూ.కోటి తేవాలంటూ భర్త, అత్తమామల టార్చర్.. మహిళా డాక్టర్ సూసైడ్
అత్తింటి వేదింపులకు మహిళా వైద్యురాలు బలైంది. పుట్టింటి నుంచి కోటి రూపాయలను తేవాలని భర్తతోపాటు అత్తమామలు నిత్యం వేదించడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది..
ఛత్రపతి శంభాజీనగర్, అక్టోబర్ 16: ఆమె ఓ వైద్యురాలు. రెండు చేతులా సంపాదిస్తుంది. సంపాదనంతా అత్తింటి వాళ్లకే ఇస్తుంది. కానీ వారికి ఆమె సంపాదన సరిపోలేదు. పుట్టింటికి వెళ్లి రూ. కోటి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అత్తమామలతోపాటు కట్టుకున్న భర్త కూడా వారితో చేతులు కలిపి రోజూ మానసికంగా, శారీరకంగా హింసించ సాగారు. దీంతో విసిగిన ఆ మహిళా వైద్యురాలు చివరకు మరణాన్ని ఆశ్రయించింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక బుమ్రేకు బీడ్‌లో నివసించే నీలేశ్‌తో 2022లో వివాహం జరిగింది. వీరి వివాహం జరిగిన రెండు నెలలకే అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఆస్పత్రి పెట్టేందుకు పుట్టింటి నుంచి రూ.కోటి తేవాలంటూ ఆమెను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవారు. వారి వేధింపులను భరించలేక ఈ ఏఆడాది ఆగస్టులో ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త నీలేష్, అతడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరిపై గృహహింస కేసు నమోదు చేసింది. అనంతరం అత్తింటికి వెళ్లకుండా పర్భాని జిల్లాలోని పాలం పట్టణంలో తన తల్లితో కలిసి జీవించసాగింది. అయితే ప్రియాంక భర్త, అతని బంధువులు మాత్రం డబ్బు కోసం ఫోన్‌లో ఒత్తిడి చేయసాగారు.
ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రియాంకకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఫోన్ మాట్లాడేందుకు ఇంట్లో పైఅంతస్తులోకి వెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి పై అంతస్తులో ఫోర్‌పై చలనం లేకుండా పడిపోయి కనిపించింది. గమనించిన తల్లి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పాలెం పోలీసులు డాక్టర్ ప్రియాంక భర్త, నలుగురు బంధువులపై ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ సిద్ధం చేశారు. అత్తింటి ధన దాహానికి తన కూతురు బలైందని, వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలు ప్రియాంక తల్లి డిమండ్ చేసింది.