AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Gandhi: వయనాడు బరిలో ప్రియాంక గాంధీ.. సీపీఐ, బీజేపీ తరపున పోటీ చేయబోయేది ఎవరు..?

కొంతకాలం క్రితం ప్రకృతి విలయంతో అతలాకుతమైన వయనాడులో పొలిటికల్ గేమ్ మొదలుకాబోతోందా ? కాంగ్రెస్‌కు ఎంతో ప్రత్యేకమైన ఈ ఎన్నికను బీజేపీ కూడా సవాల్‌గా తీసుకోనుందా ? వయనాడులో రాహుల్‌పై పైచేయి సాధించలేకపోయిన సీపీఐ.. మరో కాంగ్రెస్ ముఖ్యనేతకు ధీటైన పోటీ ఇస్తుందా ? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న హాట్ డిస్కషన్.

Priyanka Gandhi: వయనాడు బరిలో ప్రియాంక గాంధీ.. సీపీఐ, బీజేపీ తరపున పోటీ చేయబోయేది ఎవరు..?
Priyanka Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2024 | 1:19 PM

Share

మరో కీలక ఎన్నికల సమరానికి నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలతో పాటు కీలకమైన వయనాడు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 13న వయనాడు పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న వయనాడు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

వయనాడు నుంచి ప్రియాంక గాంధీ పోటీ

ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు వయనాడు పార్లమెంట్ ఉప ఎన్నిక ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండటమే. గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడుతో పాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ రెండు స్థానాల్లో ఆయన ఏ సీటును వదులుకుంటారనే దానిపై కొద్దిరోజులు సస్పెన్స్ కొనసాగింది. అయితే రాయ్‌బరేలీ సీటు నుంచి ఎంపీగా కొనసాగాలని డిసైడయిన రాహుల్ గాంధీ.. వయనాడు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

తాను వయనాడు ఎంపీగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ.. తన స్థానంలో వయనాడు నుంచి పోటీ చేయబోయేది ఎవరనే అంశంపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. దీంతో వయనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరు మూడు నెలల కిందటే ఖరారైంది.

సీపీఐ, బీజేపీ తరపున పోటీ చేయబోయేది ఎవరు ?

2019లో అమేథితో పాటు తొలిసారి వయనాడు నుంచి పోటీ చేశారు రాహుల్ గాంధీ. అప్పట్లో అమేథి నుంచి ఓడిన రాహుల్‌ గాంధీ.. వయనాడులో మాత్రం భారీ మెజార్టీతో గెలిచారు. 2019-24 వరకు వయనాడు ఎంపీగానే కొనసాగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీతో పాటు మరోసారి వయనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. తన సమీప ప్రత్యర్థి అయిన సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాగా 3 లక్షల 64 వేల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేంద్రన్‌కు లక్షా 41 వేల ఓట్లు వచ్చాయి. ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో వయనాడు ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఈసారి వయనాడులో సీపీఐ, బీజేపీ తరపున ఎవరు బరిలో దిగుతారు ? ప్రియాంకకు ఆ రెండు పార్టీ నుంచి పోటీ ఏ విధంగా ఉంటుందన్నది అంశంపై అప్పుడే పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈసారి పోటీలో ఉండబోయేది ప్రియాంక గాంధీ కాబట్టి.. బీజేపీ ఈ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ఉప ఎన్నికను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. వయనాడు బై పోల్ వార్.. ఇంట్రెస్టింగ్ ఫైట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..