India Economy: జెట్ స్పీడులో భారత ఆర్థికాభివృద్ధి.. ముందుంది మరింత మంచికాలం..

మోదీ 3.0 సర్కార్ పాలన అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతోపాటు.. ఆర్థిక వ్వవస్థకు ఊతమిచ్చేలా దూసుకెళ్తోంది.. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (స్టార్టప్‌లు) సెక్టర్‌లను విస్తరించడం, వ్యాపార రంగాలకు ప్రోత్సాహాకాలను అందించడం, పెట్టుబడుదారులను ఆకట్టుకునే నిర్ణయాలను తీసుకోవడం.. ఇవన్నీ ఆర్థిక వృద్ధిని పెంచేలా దోహద పడుతున్నాయి..

India Economy: జెట్ స్పీడులో భారత ఆర్థికాభివృద్ధి.. ముందుంది మరింత మంచికాలం..
India’s Economy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2024 | 2:32 PM

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.. ఇప్పుడిప్పుడే పలు దేశాలు కోలుకుంటుంటుండగా.. మరికొన్ని దేశాలు అలానే ముందుకు సాగుతున్నాయి.. అయితే.. భారతదేశం అలా కాదు.. ఆర్థిక వ్యవస్థే కాదు.. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వడంతోపాటు.. మరింత బలంగా మారింది.. దానికి ప్రధాన కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే.. కరోనా తర్వాత.. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది.. ఆర్థిక వ్యవస్థను గట్టేక్కించేందుకు పలు సంస్కరణలు తీసుకువచ్చింది. దీంతో విదేశీ పెట్టుబడులు సైతం భారీగా పెరిగాయి.. మేక్ ఇన్ ఇండియా.. ఆత్మనిర్భర్ భారత్, సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. లాంటి నినాదాలతో పెట్టుబడులను ఆకర్షించింది. అంతేకాకుండా.. పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా సంస్కరణలు, మార్గనిర్దేశం, సహాయ సహకరాలను పెంచడం కూడా వ్యాపార వర్గాలను ఆకట్టుకునేలా చేసింది.. దానికి నిదర్శనం సెమీ కండక్టర్స్ రంగంలో భారీ పెట్టుబడులు.. మొబైల్ తయారీ యూనిట్లు పెరగడం.. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీలు వాటి సంబంధిత పరిశ్రమలు పెరగడం..

అయితే.. మోదీ 2.0 కి మించి… ఇప్పుడు 3.0 సర్కార్ పాలన అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతోపాటు.. ఆర్థిక వ్వవస్థకు ఊతమిచ్చేలా దూసుకెళ్తోంది.. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి అంటే.. 2047లో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని.. వికసిత్ భారత్ నినాదంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక నినాదంతో ముందుకు సాగుతోంది.. ఆర్థిక శ్రేయస్సు, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం ఇలా అన్ని విషయాలతోపాటు.. తిరుగులేని శక్తిగా మార్చాలన్నదే ప్రధాని మోదీ నినాదం.. సంకల్పం.. దానికోసం ఇప్పటికే.. దూరదృష్టితో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు.

ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (స్టార్టప్‌లు) సెక్టర్‌లను విస్తరించడం, ప్రోత్సాహాకాలను అందించడం నుంచి వ్యాపార రంగానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా నిర్ణయాలను తీసుకుంటోంది.. అలాగే ప్రతి రంగంలో కూడా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.. డిజిటల్ ఇండియా నినాదంతో డిజిటల్ కనెక్టవిటీ, యూపీఐ పేమేంట్స్ పెరగడం, టెలికాం రంగంలో మార్పులు.. ప్రతి మూలకు ఇంటర్నెట్ సౌకర్యం.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయి.

భారతదేశం గత దశాబ్దంలో మొబైల్ ఫోన్స్ ను దిగుమతి చేసుకుంటే.. ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ల యూనిట్లు 200పైగా ఉన్నాయి.. ప్రస్తుతం ఏకంగా ఆరు రెట్లు మొబైల్స్​ను ఇండియాలోనే తయారు చేస్తున్నాం.. ఎగుమతి చేస్తున్నాం.. మేక్ ఇన్ ఇండియా అని చాటిచెబుతున్నాం.. అంటే.. మన సాంకేతిక పరిజ్ఞానం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

ప్రపంచ GDP ర్యాంకింగ్ 2024 జాబితా ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ ఉంది.. కరోనా నష్టం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి 12 ఏళ్లు పడుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు నివేదిక తెలిపింది.. అయితే.. ఈ నివేదికలు, అంచనాల మధ్య ఆర్థిక వ్యవస్థలో భారత్ మరింత ముందుకు చేరుకుంటుందని.. వ్యాపార రంగంతోపాటు.. అన్ని రంగాల్లో ఇదే దూకుడును ప్రదర్శిస్తుందని వ్యాపార దిగ్గజాలు పేర్కొంటుండం ఆసక్తికరంగా మారింది.

భారతీయ పౌరులకు కనెక్టివిటీ, డిజిటల్ పరివర్తనను అందించడంలో టెలికాం రంగం సాధించిన పురోగతిని హైలైట్ చేస్తూ 8వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఢిల్లీలో వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ-2024ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకోసం అంతర్జాతీయ సంస్థలు​ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏకంగా ఆరు రెట్లు మొబైల్స్​ను ఇండియాలోనే తయారు చేస్తున్నామని.. ప్రపంచానికి మేడిన్​ ఇండియా మొబైల్స్ అందిచడంలో నిమగ్నమై ఉన్నట్లు మోదీ వెల్లడించారు. సెమీ కండక్టర్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నామని…. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయన్నారు.అలాగే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మంచి కోసమే వినియోగించాలంటూ సూచించారు.. అంటే.. ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా మార్చేందుకు దూర దృష్టితో ఆలోచనలు.. ప్రోత్సహాకాలు, విధానాలను రూపొందించడం, సకాలంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పకనే చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో ఎథిక్స్ తోపాటు ఆవిష్కరణలు ముఖ్యమని నొక్కిచెప్పారు.

6.8 శాతం వృద్ధితో..

భారతదేశం బలమైన ఆర్థిక వృద్ధిగా కొనసాగుతుందని ఒపెక్ OPEC (Organization of the Petroleum Exporting Countries) అంచనా వేసింది.. ఒపెక్ తన తాజా నెలవారీ అప్‌డేట్‌లో అక్టోబరులో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్వల్ప క్షీణతను చవిచూసిందని అయినప్పటికీ.. తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని తెలిపింది. 2024-25లో 6.8 శాతంతో వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది.

అక్టోబర్ OPEC తాజా నివేదిక ప్రకారం.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2024 రెండవ త్రైమాసికంలో స్వల్పంగా మందగమనాన్ని ఎదుర్కొంది.. మొదటి త్రైమాసికంలో 7.8% నుంచి 6.7% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ మందగమనానికి ప్రధానంగా ఎన్నికల సీజన్‌లో ప్రభుత్వ వ్యయం తగ్గుముఖం పట్టింది. మందగమనం ఉన్నప్పటికీ, 2021 నుండి ఆర్థిక వ్యవస్థకు సగటున 54% సహకారం అందించిన సేవల రంగం, గత త్రైమాసికంలో 6.7%తో పోలిస్తే, 2Q24లో వృద్ధి 7.2%కి వేగవంతమై, స్థితిస్థాపకతను కనబరిచింది. సెప్టెంబరులో నిరుద్యోగం రేటు ఆగస్ట్‌లో 8.5% నుంచి 7.8%కి తగ్గడంతో కార్మిక మార్కెట్లో సానుకూల ధోరణిని నివేదిక హైలైట్ చేసింది. 2024 పూర్తి సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి దాని మునుపటి అంచనాలకు అనుగుణంగా 6.8% వద్ద బలంగా ఉంటుందని OPEC అంచనా వేసింది. ప్రభుత్వ మద్దతు, ఎన్నికల తర్వాత పునరుద్ధరించబడిన వ్యయం, నిరంతర వినియోగదారుల వ్యయం సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధిని పెంచుతాయని భావిస్తున్నట్లు తెలిపింది.

ఆర్థిక వృద్ధి.. పలు రంగాల అభివృద్ధిపై ఎవరెవరు ఏమన్నారంటే..

భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఊపందుకుందని.. బలంగా మారుతుందని OECD (Organisation for Economic Co-operation and Development) చెప్పింది.. ఆరేళ్ల తర్వాత H1 FY25లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 10 మిలియన్లకు చేరుకున్నాయి. స్కూటర్ల అమ్మకాలు 22%, బైక్‌ల అమ్మకాలు 13% ఉందని పేర్కొంది. రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల పరిణామాలు ఉంటాయని పేర్కొంది.

దీంతోపాటు.. భారతదేశంలో గృహ కొనుగోలుదారుల సంఖ్య పెరగిందని మ్యాజిక్‌బ్రిక్స్ వెల్లడించింది. నిర్మాణ రంగంలో కీలక వృద్ధిని సాధించినట్లు పేర్కొంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రిటైల్ విక్రయాలు ఏప్రిల్-సెప్టెంబర్‌లో 36 శాతం పెరిగి 3,214 యూనిట్లకు చేరుకున్నాయని ఆ కంపెనీ ప్రకటించింది.

దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ సెప్టెంబర్‌లో 6 శాతం పెరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. విడుదల చేసిన డేటా ప్రకారం, సెప్టెంబర్ 2024 లో ఇండిగో మార్కెట్ వాటా 63 శాతానికి పెరిగింది.. అయితే ఎయిర్ ఇండియా 15.1 శాతానికి పెరిగింది.

మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేకపోవడం వల్ల కొత్త పార్టిసిపెంట్‌లు UPI ఎకోసిస్టమ్‌లో చేరడానికి ఆటంకం కలిగించడం లేదని.. 50 కొత్త థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (TPAPలు) రియల్ టైమ్ ప్రోవైటర్లు ఆసక్తిగా ఉన్నారని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) తెలిపింది.

అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో భారత కాఫీ ఎగుమతులు పెరగడం.. కూడా వృద్ధిలో భాగమే.. కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం గతేడాది ఇదే కాలంలో రూ.4,956 కోట్లతో పోలిస్తే ఇది 55 శాతం పెరిగింది.

2025లో భారతదేశం 9.5% జీతాల పెరుగుదలను కొనసాగించనుందని WTW సర్వే వెల్లడించింది. దీంతో చాలా అవకాశాలతో పాటు వృద్ధి రేటు పెరుగుతుందని అంచనా వేసింది.

మిలిటరీ పోరాట పటిమను పెంచేందుకు 31 ప్రిడేటర్ డ్రోన్ల కోసం అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రక్షణతో పాటు.. భారత ఆర్థిక వ్యవస్థను బలంగా మార్చనుంది.

టాటా ఐదేళ్లలో 500,000 తయారీ ఉద్యోగాలను సృష్టిస్తుందని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీలు, సంబంధిత పరిశ్రమలు వంటి రంగాల్లో టాటా గ్రూప్ వచ్చే ఐదేళ్లలో 500,000 తయారీ ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు.

భారతదేశంలో UPI పేమెంట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా అవతరిస్తుందని, 6G ఆధిపత్యంలో భారతదేశం ముందుంటుందని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ ప్రయాణానికి AI శక్తినిస్తుందని.. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆకాష్ అంబానీ ప్రకటించారు.

“చాలా శక్తివంతమైన భారతదేశాన్ని” నిర్మిస్తామని ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నామని ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ప్రకటించారు. మోడీ అనుసరిస్తున్న విధానాన్ని ప్రశంసించిన ఆయన.. శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో తన పాత్రను పోషిస్తానని పేర్కొన్నారు భారతదేశ టెలికాం విప్లవంలో ఎయిర్‌టెల్ ముందంజలో ఉందన్నారు.

చాలా శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించేందుకు తాము భాగస్వామ్యం అవుతామని.. ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ప్రకటించారు. మోడీ అనుసరిస్తున్న విధానాన్ని ప్రశంసించిన ఆయన.. శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో తన పాత్రను పోషిస్తానని పేర్కొన్నారు భారతదేశ టెలికాం విప్లవంలో ఎయిర్‌టెల్ ముందంజలో ఉందన్నారు.

మోదీ ప్రభుత్వం డిజిటల్ కనెక్టివిటీ ప్రాముఖ్యతను గుర్తించి.. అభివృద్ధికి బాటలు వేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. చిన్న చిన్న అవసరాలను సైతం గుర్తించి ఎన్నో అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. సాధికారత, సమ్మిళిత డిజిటల్ దేశం వైపు మమ్మల్ని నడిపించడానికి కృషిచేస్తామన్నారు.