Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై అదే ఉత్కంఠ.. లిస్టులో పార్టీ అగ్రనేతలు.. ఎవరెవరంటే.?

శ్రావణమాసంలో దాదాపుగా పీసీసీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందని హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎవరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

Telangana: తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై అదే ఉత్కంఠ.. లిస్టులో పార్టీ అగ్రనేతలు.. ఎవరెవరంటే.?
Telangana Congress
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2024 | 3:45 PM

శ్రావణమాసంలో దాదాపుగా పీసీసీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందని హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎవరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో.. నూతన పీసీసీ అధ్యక్షుడితో పాటు రెండవ దఫా కార్పొరేషన్ పదవులు కూడా భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తోంది.

పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం సీనియర్లంతా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని సదరు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పదవిని ఈసారి బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. ఆ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కార్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సురేష్ షెట్కార్ జహీరాబాద్ ఎంపీగా ఉండగా.. మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

ఈసారి ఎస్సీ లేదా ఎస్టీ సామాజికవర్గానికి పీసీసీ పదవి ఇవ్వాలని కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క పేరు.. అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఎస్సీ సామాజికవర్గానికి కేటాయిస్తే తనకు అవకాశం కల్పించాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అదేవిధంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌లు ఢిల్లీ పెద్దల దగ్గర పట్టుబట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. బలరాం నాయక్, మధుయాష్కీ, జగ్గారెడ్డి, సంపత్ కుమార్‌ల పేర్లు పీసీసీ పదవి రేసులో దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ పదవి ఈసారి మహిళలకు కూడా కట్టబెట్టాలని హైకమాండ్ భావిస్తోందట. మరి శ్రావణమాసంలోపు అధ్యక్షుడిని హైకమాండ్ ఖరారు చేస్తుందా.? అదేవిధంగా కార్పొరేషన్ పదవులు కూడా కట్టబెడుతుందా.? ఇంకోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందా.? అనే ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాతే సమాధానాలు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..