Idli Factory: రోజుకు 25 వేలు ఇడ్లీలు తయారు చేసే ఫ్యాక్టరీ.. ఒక రోజు సంపాదన ఎంతో తెల్సా
మహారాష్ట్రలోని సాంగ్లీలో తిమ్మప్ప శెట్టి స్థాపించిన ఇడ్లీ ఫ్యాక్టరీ విజయగాథ ఇది. పెద్దగా చదువుకోని తిమ్మప్ప కష్టపడి రోజుకు 25,000 ఇడ్లీలు ఉత్పత్తి చేస్తున్నారు. హోటళ్లకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తూ, ఖర్చులు పోను రోజుకు 25,000 నుంచి 30,000 రూపాయలు లాభం ఆర్జిస్తున్నారు. ఈ వ్యాపారం ఆయన పట్టుదల, దూరదృష్టికి నిదర్శనం.

మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న తిమ్మప్ప శెట్టి ఇడ్లీ ఫ్యాక్టరీ రోజుకు 25,000 ఇడ్లీలు, 2,000 లీటర్ల సాంబార్‌ను తయారు చేస్తుంది. హోల్‌సేల్ ధరలకు ఇడ్లీలను హోటళ్లకు సరఫరా చేయాలనే ఆలోచనతో కర్ణాటకకు చెందిన తిమ్మప్పశెట్టి ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. ఈయన పెద్దగా చదువుకోలేదు. తిమ్మప్ప శెట్టి 1992లో సాంగ్లీకి వచ్చి మొదట్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. “మొదట ఇక్కడికి వచ్చినప్పుడు కుక్‌గా పనిచేశాను. ఈ ప్రాంతం నాకు కొత్త కావడంతో, మరాఠీ, హిందీ రాకపోవడంతో వెయిటర్ ఉద్యోగం దొరకలేదు. కానీ, రెండు మూడు నెలల్లోనే బేసిక్ మరాఠీ, హిందీ నేర్చుకున్నాను” అని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన నెల జీతం కేవలం 300 రూపాయలు, అంటే రోజుకు 10 రూపాయలు.
ఆయన ఇడ్లీ వ్యాపారాన్ని మొదట తన భార్యతో కలిసి ప్రారంభించారు. తన భార్య ఇంట్లో ఇడ్లీలు తయారు చేస్తుంటే, తిమ్మప్ప స్వయంగా మార్కెట్‌లకు వెళ్లి హోటళ్లు, రెస్టారెంట్లలో వాటిని అమ్మేవారు. మొదట్లో సరైన స్పందన లభించలేదు, కొత్త వ్యక్తి కావడంతో రెస్టారెంట్ యజమానులు నమ్మలేదు. అయితే, ఆయన పట్టుదలతో ఒత్తిడిని అధిగమించి, చివరికి తన ఇడ్లీలను అమ్ముకోగలిగారు. క్రమంగా, రోజుకు 10 ఇడ్లీల అమ్మకాలు 50కి, ఆ తర్వాత 100కి, చివరికి వేలల్లోకి పెరిగాయి.
ప్రస్తుతం, తిమ్మప్ప ఫ్యాక్టరీలో ఇడ్లీలతో పాటు రోజుకు 15,000 మినపప్పు వడలు.. 2,000 సమోసాలు కూడా తయారు చేస్తున్నారు. ఖర్చులు పోను, రోజుకు 25,000 నుంచి 30,000 రూపాయల నికర లాభం సంపాదిస్తున్నట్లు తిమ్మప్ప వెల్లడించారు. వ్యాపారం ప్రారంభంలో, ఇంట్లో కేవలం 25 ఇడ్లీలు మాత్రమే ఉడికే పాత్రను ఉపయోగించారు. డిమాండ్ పెరగడంతో, ఒకేసారి 200 ఇడ్లీలు ఉడికే పెద్ద పాత్రలో పెట్టుబడి పెట్టారు. అది కూడా సరిపోదని గుర్తించి, ప్రత్యేకంగా తయారు చేసిన ఆవిరి మెషిన్‌ను ఆర్డర్ చేశారు. ఈ మెషిన్‌లో ఒకేసారి 2,000 ఇడ్లీలను పెట్టవచ్చు, ఇది ఇడ్లీల తయారీ ప్రక్రియను సులభతరం చేసింది.
ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీ రోజుకు 40,000 ఇడ్లీల వరకు తయారు చేసేది. అయితే, ఆయన వద్ద పనిచేసిన వంటవాళ్లతో సహా చాలా మంది ఇప్పుడు తమ సొంత ఇడ్లీ తయారీ షాపులను ప్రారంభించారు. దీంతో, తిమ్మప్ప ఇడ్లీల తయారీని తగ్గించాలని నిర్ణయించారు. ఆయన ఫ్యాక్టరీలో బియ్యంతో, రవ్వతో రెండు రకాల ఇడ్లీలు తయారు చేస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లి మండపాలు, హాస్పిటల్ క్యాంటీన్‌లకు ఈ ఇడ్లీలు సరఫరా అవుతాయి. ఫ్యాక్టరీ దాదాపు రోజంతా నడుస్తుంది.
