Telangana: దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదు.. మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ నిరసనలపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) స్పందించారు. అగ్నిపథ్ అనేది ఓ అనాలోచిత నిర్ణయమన్న మంత్రి దేశ భద్రత విషయంలో....

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ నిరసనలపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) స్పందించారు. అగ్నిపథ్ అనేది ఓ అనాలోచిత నిర్ణయమన్న మంత్రి దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకమని మండిపడ్డారు. పదో తరగతి పాసైన వారు అగ్నిపథ్(Agnipath) లో చేరి, తిరిగి వెళ్లేటప్పుడు 12 వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం దారుణమని విమర్శించారు. మొన్న వ్యవసాయ చట్టాలు, నేడు అగ్నిపథ్ వంటి నిర్ణయాలతో యువతను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనం తెస్తాం.. రూ.15 లక్షలు పేదల ఖాతాలలో వేస్తాం అని అమాయకుల ఓట్లు కొల్లగొట్టి, అధికారం చేపట్టాక జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయాన్ని దోచుకున్నాని ఆక్షేపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుకు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుండి 7.83 శాతానికి పెరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఆకలి సూచిలో 110 దేశాలలో భారత్ 101 స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తుంటే కేంద్ర పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. మోదీది అంతా మోసాల పాలన. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు సాగుతున్నాయి. యువత ఆగ్రహాన్ని గమనించి కేంద్రం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి. దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదు, దేశ భవిష్యత్ కు, రక్షణకు దోహదకారి. వేతనాలు, ఫించన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం తలాతోకాలేని నిర్ణయం తీసుకంటోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిరసన తెలుపుతున్న యువతపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పులలో ఒకరు మరణించడం , కొందరు గాయపడడం బాధాకరం. బాధిత కుటుంబానికి, గాయపడిన కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించాలి. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రం బాధ్యత వహించాలి.
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి