Virata Parvam Review: అడవి సాక్షిగా మెప్పించే రవన్న – వెన్నెల ప్రేమకథ.. భావోద్వేగాల మిళితం

మహాభారతంలో విరాటపర్వానికి అత్యంత గొప్ప ప్రాముఖ్యం ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని అంశాలకు, ఆ విరాటపర్వంతో ముడిపెడుతూ టైటిల్‌ జస్టిఫికేషన్‌ చేసే ప్రయత్నం చేశారు డైరక్టర్‌ వేణు ఊడుగుల.

Virata Parvam Review: అడవి సాక్షిగా మెప్పించే రవన్న - వెన్నెల ప్రేమకథ.. భావోద్వేగాల మిళితం
Virata Parvam
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Team Veegam

Updated on: Jun 17, 2022 | 2:46 PM

తెలంగాణ నేపథ్యం, కమ్యూనిస్ట్ భావజాలం, నక్సలిజం రూట్స్ తెలిసిన వాళ్లు ఈ తరం యువతలో ఎంతమంది? సమసమాజ స్థాపనకు కృషిచేస్తూ అసువులు బాసిన నిన్నటితరం అన్నలు ఎందరు? అడవి సాక్షిగా అంతా సవ్యంగానే జరిగిందా? మనుషులన్నాక పొరపొచ్చాలు రావా? సొసైటీ బాగోగుల కోసం కృషి చేస్తామని నగాదారి పట్టిన వారి మనసుల్లో నిక్షిప్తమైన నిజాలేంటి? ఇలాంటి పలు అంశాలకు సమాధానం విరాటపర్వంలో దొరుకుతుందా? చూసేద్దాం…

సినిమా: విరాటపర్వం

సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్

నటీనటులు: సాయిపల్లవి, రానా, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్‌ చంద్ర, ప్రియమణి, జరీనా వాహబ్‌, ఈశ్వరి రావు, సాయి చంద్‌, నివేదా పేతురాజ్‌, జగదీష్‌ ప్రతాప్‌ భండారి తదితరులు

ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

సంగీతం: సురేష్‌ బొబ్బిలి

కెమెరా: డేనీ సంచెజ్‌ లోఫెజ్‌, దివాకర్‌ మణి

రచన – దర్శకత్వం: వేణు ఊడుగుల

నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి, రానా దగ్గుబాటి

విడుదల: 17.06.2022

రవన్న అలియాస్‌ అరణ్య (రానా దగ్గుబాటి) ఓ దళానికి అధ్యక్షుడు. యువతలో స్ఫూర్తి నింపడానికి, అణగారిన వర్గాల్లో ఉత్సాహం నింపడానికి, మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి చిక్కటి కవిత్వం రాస్తుంటాడు. అనుకోకుండా స్నేహితురాలి ద్వారా అతని కవితల పుస్తకం చదువుతుంది వెన్నెల (సాయి పల్లవి). అతని కవిత్వానికి ఆకర్షితురాలవుతుంది. ఒకానొక సందర్భంలో తమ గ్రామంలో పోలీసులకు ఎదురు తిరగాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా, అరణ్యను కలుస్తుంది. అతని రూపంతో కాకుండా అతని అక్షరాలతో ప్రేమలో పడుతుంది. ఆ భావంతో మమేకమవ్వాలని నిర్ణయించుకుంటుంది. మేనబావతో పెద్దలు కుదిర్చిన పెళ్లిని వద్దని తెగువతో చెప్పి, అరణ్యను వెతుక్కుంటూ అడవి బాట పడుతుంది. అసలే దళం. అణువణువునూ అనుమానించాల్సిన పరిస్థితిలో ఉన్న రవన్న… వెన్నెల ప్రేమను నమ్మాడా? ఆమెను అక్కున చేర్చుకున్నాడా? అసలు అతని దగ్గరికి వెళ్లడానికి వెన్నెల చేసిన కృషి ఏంటి? మధ్యలో శకుంతల టీచర్‌ చేసిన సాయం ఏంటి? భారతక్క, రఘు అన్న, సమ్మయ్య వల్ల వెన్నెలకు ఏం జరిగింది? అప్పట్లో తెలంగాణ పల్లెలెలా ఉన్నాయి? ఉద్యమాలు ఎలా నడిచాయి? ఇన్ ఫార్మర్ల వ్యవస్థ ఎలా సాగేది? వంటివన్నీ తెలుసుకోవాలంటే విరాటపర్వం చూడాల్సిందే.

మహాభారతంలో విరాటపర్వానికి అత్యంత గొప్ప ప్రాముఖ్యం ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని అంశాలకు, ఆ విరాటపర్వంతో ముడిపెడుతూ టైటిల్‌ జస్టిఫికేషన్‌ చేసే ప్రయత్నం చేశారు డైరక్టర్‌ వేణు ఊడుగుల. ఆరడగులకు పైగా ఎత్తు, దళాన్ని కమాండ్‌ చేసే పాత్రలో, మంచీ చెడుల విచక్షణ తెలిసిన రవన్న కేరక్టర్‌కి అక్షరాలా సరిపోయారు రానా. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మామూలుగా హీరోల ఒన్‌ మ్యాన్‌ షోలు మన దగ్గర పాపులర్‌. అయితే విరాటపర్వం ఆద్యంతం వెన్నెల ఒన్‌ విమెన్‌ షో. ఆమె చుట్టూ కథ నడుస్తుంది. ఆమె కథ చెప్పడంతో సినిమా మొదలై, ఆమె చెప్పడంతోనే కథ పూర్తవుతుంది. అంతటి ప్రాధాన్యమున్న పాత్రకు అంతే గొప్పగా ప్రాణం పోశారు సాయిపల్లవి. నిష్కల్మషమైన ప్రేమ, అనుకున్నది సాధించేవరకు అలుపెరగని తత్వం, పట్టువదలని మొండితనం, మంచీ చెడుల విచక్షణతో మెలగడం, సమయస్ఫూర్తి, త్వరగా నేర్చుకునే తీరు… వంటివన్నిటినీ కలిపి సాయిపల్లవి పాత్రను ఇంటెన్స్ తో తీర్చిదిద్దారు వేణు ఊడుగుల. ఈ సినిమాలో సాయిపల్లవి చాలా వరకు కళ్లతోనే యాక్ట్ చేశారు. ఆమె తల్లిదండ్రులుగా ఈశ్వరీరావు, సాయిచంద్‌, మేనబావగా రాహుల్‌ రామకృష్ణ, దళ సభ్యులుగా ప్రియమణి, నవీన్‌చంద్ర, ప్రొఫెసర్‌గా డైరక్టర్‌ వీరశంకర్‌, టీచర్‌ శకుంతలగా నందితాదాస్‌ అందరూ తమ పాత్రలకు న్యాయం చేసిన వాళ్లే. కథలో సెన్సిటివ్‌ విషయాలను డైరక్టర్‌ పోట్రే చేసిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. తన తల్లి రాసిన లెటర్‌ చదివి రవన్న కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో వెన్నెల అతన్ని ఓదార్చడానికి ముందు భుజం మీద చేయి వెయ్యబోయి, మళ్లీ తమాయించుకుని అతని మోచేతిని పట్టుకోవడం, తుపాకితో శాంతి దొరకదు… ఈ పిల్లను పెళ్లి చేసుకో అని రవన్నకు తల్లి చెప్పిన మాటలు, రెస్క్యూ టైమ్‌లో అతని చేతిలోని తుపాకి కిందపడ్డప్పుడు సందర్భోచితంగా చూపించడం, దళ సభ్యుల మధ్య ఆటపాటలు, ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకునే సన్నివేశాలు, నేను నీ కోడలిని అత్తా… ఈ ముచ్చట నీకొడుక్కు కూడా ఇంత తెలవదు అని వెన్నెల చెప్పడం, ఆఖరిన వెన్నెల స్వరంలో వినిపించే మాటలు, వెన్నెలకు తన తండ్రి చెప్పే మాటలు, బావా మరదళ్ల మధ్య సాగే సంభాషణలు… ఎక్కడికక్కడ సినిమాలోని భావోద్వేగాన్ని ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా చేసేవే.

సురేష్‌ బొబ్బిలి పాటలు సందర్భోచితంగా సాగాయి. కెమెరా, ఎడిటింగ్‌ అన్నీ చక్కగా కుదిరాయి. దళంలో సభ్యుల మధ్య మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయి? అందరూ కలిసి ఎలా పోరాడుతారు? విభేదాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు. సరళ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన సినిమా, అప్పటి విషయాలను కాసింత సినిమాటిక్‌ లిబర్టీస్‌తో చూడాలనుకునేవారికి భావోద్వేగాలతో మిళితం అయిన వినోదం కచ్చితంగా అందుతుంది.

– డా. చల్లా భాగ్యలక్ష్మి