Agnipath Protest: అగ్నిపథ్‌కు అగ్గి పరిష్కారమా..? విధ్వంసంతో ఆందోళకారులు సాధించిందేంటి?
Agnipath Protest News: ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో.. గత రెండ్రోజులుగా బీహార్ లో జరిగిన ఘటనల్లో కనిపిస్తోంది ఒక్కటే.. ఇది నిరసన ప్రదర్శనలు కావు..విధ్వంస రచనలు..
Agnipath Protest: అగ్నిపథ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో ఈ స్థాయిలో విధ్వంసం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. విధ్వంసమే సమస్యకు పరిష్కారమా..? ఇప్పుడు దేశం ఇదే ప్రశ్న ఆందోళనకారుల్ని అడుగుతోంది.. ఇప్పుడు ఆందోళనకారులు యుద్ధం చేస్తున్నది ఎవరి మీద..? మన రైళ్లని మనమే తగులబెట్టుకుని మన ఆస్తుల్ని మనమే ధ్వంసం చేసుకోవడాన్ని అసలు ఎవరైనా నిరసన కింద పరిగణిస్తారా..? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు నచ్చకపోతే నిరసన తెలియజేయడానికి అనేక మార్గాలున్నాయి. కానీ ఈ విధంగా మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకుని ఆ అగ్గిలో నిరసన తెలుపుతానంటే సమాజం ఒప్పుకుంటుందా..? ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో.. గత రెండ్రోజులుగా బీహార్ లో జరిగిన ఘటనల్లో కనిపిస్తోంది ఒక్కటే.. ఇది నిరసన ప్రదర్శనలు కావు..విధ్వంస రచనలు..
ఇది విధ్వంసం వెనుక కుట్రా..?
దేశంలో కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి ఆందోళన చేశారు. అది కూడా శాంతియుతంగా.. ఈ మాదిరిగా రైళ్లను ఎక్కడా తగులబెట్టలేదు. ఆఖరికి నడిరోడ్డు మీదే టెంట్లు వేసుకుని రాత్రి పగలు ఆందోళన చేశారు. ఫలితంగా కేంద్రం ప్రభుత్వం దిగివచ్చింది.రైతు చట్టాలను వెనక్కు తీసుకుంది.. అంతెందుకు ఏళ్లతరబడి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఎక్కడా రక్తపాతం లేదు.. ఇలాంటి దారుణమైన విధ్వంసాలు లేనేలేవు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతుల్లో తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు విజయం సాధించారు. నాటి గాంధీజీ కూడా బ్రిటిష్ వారిపై పోరాటం వివిధ శాంతి మార్గాల్లో చేశారు తప్ప విధ్వంసాలకు పాల్పడమని ఎక్కడా చెప్పలేదు. గత నాలుగురోజులుగా బాసర త్రిబుల్ ఐటీలో వందలమంది విద్యార్థులు శాంతియుతంగా గేటు వద్దే నిరసన తెలియజేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మండుటెండలో గొడుగులు పట్టుకుని కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. అంతేగానీ ఎక్కడా త్రిబుల్ ఐటీ ఆస్తులను ధ్వంసం చేయలేదు. కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనను ఎవరూ హర్షించరు.
పైగా ఇలాంటి విధ్వంసాల వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు నరకం అనుభవించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాంపై ఆందోళనకారులు ఇష్టారాజ్యంగా స్టాళ్లను ధ్వంసం చేస్తూ రైళ్లని తగులబెడుతుంటే అక్కడే ఉన్న కొందరు తల్లులు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఒక తల్లైతే పగులగొడుతున్న స్టాల్ ముందు ఏడుస్తున్న తన బిడ్డని గుండెలకు హత్తుకుని ప్రాణభయంతో దిక్కులు చూస్తున్న దృశ్యం చూసే జనాన్ని కలచివేసింది. రైల్వే పోలీసుల ఫైరింగ్ లో గాయాలపాలై పోలీసులు మోసుకొస్తున్న క్షతగాత్రులను చూసినప్పుడు కూడా ఈ రకమైన జాలి, ఆవేదన జనాల్లో కలగలేదు. ఎందుకంటే ఈ విధ్వంసాన్ని ప్రజాస్వామ్య వాదులెవరూ ఆహ్వానించరు కాబట్టి..
ఇది అసలు నిజంగా అనుకోకుండా జరిగిన విధ్వంసమేనా లేక.. కుట్రకోణం ఏదైనా ఉందా..? అగ్నిపథ్ స్కీమ్ ను ఇంతలా వ్యతిరేకించాల్సిన అంశం ఉందా.. ఈ మాదిరిగా రైళ్లను తగులబెట్టేంత ఇబ్బందికర అంశం అగ్నిపధ్ లో ఉందా అనేది పరిశీలించాల్సిన అవసరముంది.
అసలు ఏంటీ అగ్నిపథ్ స్కీమ్..
సైన్యంలో చేరడానికి కేంద్రం తెచ్చిన కొత్త పథకంపేరు అగ్నిపథ్. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. లక్షల ఉద్యోగాల ప్రకటన మొదట పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి ఇప్పటికీ చాలామందికి బహుశా ఈ అగ్నిపథ్ గురించి తెలియకపోవచ్చు కూడా.. మొట్టమొదట నిరుద్యోగులకు ఉత్సాహాన్ని నింపిన ప్రకటన ఇది. కానీ ఆ తర్వాత అదే ప్రకటన విధ్వంసాలకు కారణమైంది. సైన్యంలో యువతకు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ఇది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు. అగ్నిపథ్ కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36500లో 10980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. ఈ ఒక్కసారికి గరిష్ఠ వయో పరిమితిని రెండేళ్లు అదనంగా 23 ఏళ్లకు పెంచారు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.
నాలుగేళ్ల ఉద్యోగమేంటి..?
ఇందులో అంతా బాగానే ఉంది కానీ నాలుగేళ్ల పాటు మాత్రమే ఉద్యోగం అనడమే ఇప్పుడు ఈ గొడవలకు అసలు కారణం. ఒకప్పుడు ఆర్మీ లో ఉద్యోగమంటే దేశభక్తితో ముందుకు దూసుకెళ్లేవారు. ముఖ్యంగా పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి ఆర్మీకి ఎక్కువమంది వెళ్లేవారు.. ఇప్పటికీ సైన్యంలో సింహభాగం వాళ్లే ఉంటారు. మొదట్లో ఆర్మీ ర్యాలీ పెడితే పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు..వాళ్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సైన్యంలోకి పంపడానికి ఒప్పుకునేవారు కాదు.. ఆ తర్వాత నుంచి ఆర్మీలో ఉద్యోగంవైపు యువత విపరీతమైన ఆసక్తి చూపుతోంది. పదిహనేళ్లపాటు ఆర్మీలో పని చేసి వస్తే సమాజంలో గౌరవం, మంచి జీతం, పెన్షన్ లభిస్తాయి. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల వైపు యువత విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. రష్యా వంటి కొన్ని దేశాల్లో ప్రతి ఒక్క పౌరుడు కనీసం రెండేళ్లపాటు సైన్యంలో పని చేయాలన్న నిబంధన ఉంది. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు.. ఆర్మీలో చేరడం అనేది వ్యక్తిగత నిర్ణయం..
రైల్వేచట్టాలు మరింత కఠినం.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే జీవితమంతా రైల్వే కోర్టుల చుట్టూ తిరిగాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవాళ ఆందోళనల్లో పాల్గొన్నవారు ఇకపై ఆర్మీకి సెలెక్ట్ అయ్యే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇంతపెద్ద ఎత్తున రైళ్లను తగులబెట్టినవారు రేపు సరిహద్దుల్లో దేశాన్ని ఏం కాపాడతారనే విమర్శలు అప్పుడే సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కంటే కేంద్రప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.రైల్వే చట్టాలు అంత కఠినంగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్వే ట్రాక్ లపై ఆందోళనలు చేసినవారు ఇప్పటికీ రైల్వే కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తునిలో రైలు తగులబెట్టిన ఘటనలో కేసుల్లో ఇరుక్కున్నవారు ఇప్పటికీ కోర్టులో విచారణకు హాజరవుతూనే ఉన్నారు. వివిధ ఆందోళనల్లో పాల్గొన్నవారిపై రాష్ట్రప్రభుత్వం కావాలంటే కేసులు ఎత్తేసే అవకాశం ఉంది. కానీ కేంద్రప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసుల్లో ఇరుక్కుంటే వాటిని ఎత్తివేయడం అసాధ్యం. కదులుతున్న రైల్లో ఎలాంటి కారణం లేకుండా చైన్ లాగి ట్రైన్ ఆపితే సెక్షన్ 126ప్రకారం పన్నెండు నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది..రైల్ రోకో లాంటివి చేస్తే సెక్షన్ 156ప్రకారం పధ్నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే రైళ్లను తగులబెట్టడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి ఘటనలకు కూడా పదహారేళ్ల పాటు జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. రైల్వే కోర్టుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతుంది. కచ్చితంగా ప్రతి విచారణకు కోర్టుకు హాజరు కావాల్సిందేననే నిబంధన ఉంది..
ఎవరి మీద యుద్దం..?
నిజానికి అగ్నిపథ్ పథకం విషయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలు లేవు. కేవలం బీహార్,తెలంగాణలో మాత్రమే ఈ తరహా హింసాత్మక ఘటనలు కనిపించాయి. ఈ కారణంగానే ఈ ఘటనలపై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇది కేవలం కుట్రపూరితంగానే జరిగిన విధ్వంసంగా కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇది అప్పటికప్పుడు అనుకోకుండా క్షణికావేశంతో చేసిన ఆందోళన ఏమాత్రం కాదు..ముందు రోజు నుంచే రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున విధ్వంసం చేయాలని వాట్సాప్ లలో మెసేజ్ షేర్ చేసుకున్నారు. పథకం ప్రకారం పెట్రోల్ డబ్బాలతో రైల్వే స్టేషన్లో ప్రవేశించారు. రైల్వే స్టేషన్లో రాళ్లకు కరువేముంటుంది.. చెలరేగిపోయారు.. ఇష్టమొచ్చినట్టు రైళ్లపై మొదట రాళ్ల దాడి చేశారు.. ఆ తర్వాత పెట్రోల్ డబ్బాలతో రైళ్లను తగులబెట్టారు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారు. ఈ ఆందోళన గురించి తెలీని ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంగాక అల్లాడిపోయారు. ప్రాణభయంతో వణికిపోయారు..ఫలితంగా రైల్వే శాఖ అనేక రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. హైదరాబాద్ లో అన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఎక్కడికక్కడ ప్రయాణికులు రైళ్లలోనే పడిగాపులు కాశారు. ఏం చేయాలో అర్థంగాక రైళ్లు దిగిపోయి రోడ్డుమార్గంలో వెళ్లిపోయారు. చివరికి ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయడానికి రైల్వే పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈ ఫైరింగ్ లో ఒక యువకుడు ప్రాణం కోల్పోయాడు.. మరికొందరు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజానికి అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి వచ్చింది కొంతమందైతే కేవలం విధ్వంసమే చేయాలని ప్లాన్ చేసి వచ్చిన వారు మరికొందరు. ఫలితంగా ఇప్పుడు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.. ఇపుడు రైల్వే స్టేషన్ లో ఆందోళనలు చేసి విధ్వంసాలకు పాల్పడిన వారు తమనితాము ఒక్కటి ప్రశ్నించుకోవాలి.. ఇప్పుడు మనమంతా ఎవరి మీద యుద్దం చేశాం..? ఎవరి ఆస్తులు తగులబెట్టాం..? ఎవరిపై ఆధిపత్యం సాధించాం..? అని మళ్లీ మళ్లీ ప్రశ్నించుకోవాలి. రెండువైపులా జరిగితే అది యుద్దం.. రెండు రాజ్యాల మధ్య జరిగితే అది యుద్దం..రెండు వర్గాల మధ్య జరిగితే అది యుద్దం.. కానీ ఇది యుద్దం కాదు..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ యుద్ధభూమి కానే కాదు..ఇది కేవలం విధ్వంసం.. అంతే…
-వేములపల్లి అశోక్ కుమార్, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, టీవీ9
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..