Telangana: ఓఆర్‌ఆర్ పరిధిలోని 51 గ్రామాల విలీనానికి లైన్ క్లియర్
ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న గ్రామాల దశ మారబోతుందా?. ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్ట్ నో అబ్జెక్షన్‌తో ఇక పనులు స్పీడప్ కానున్నాయా?. ఔటర్ చుట్టూ ఉన్న గ్రామాల్లో ఏం జరగబోతుంది?. పబ్లిక్ ఏమంటున్నారు?.

ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాల విలీనానికి లైన్ క్లియర్ అయింది. మున్సిపాలిటీల్లో 51 గ్రామాల విలీనానికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌కు హైకోర్టులో అడ్డంకులు తొలగిపోయాయి. పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. మాజీ సర్పంచులు వేసిన పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్ట్.
పెద్ద అంబర్‌పేట, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట మున్సిపాలిటీల్లో 51 గ్రామాలు విలీనం కానున్నాయి. మేడ్చల్ జిల్లాలో మొత్తం 28 గ్రామాలు ఏడు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 12 గ్రామాలు, సంగారెడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో 11గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ఔటర్ రింగు రోడ్డుకు అనుకున్న గ్రామాలే. శివారు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం తర్వాత వీటన్నింటినీ గ్రేటర్‌లో కలిపే అవకాశం ఉంది.
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో బాచారం, గౌరెల్లి, తారామతిపేట పంచాయతీలు విలీనం కానున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో.. బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం అవుతాయి. నార్సింగి మున్సిపాలిటీలో మీర్జాగూడ గ్రామపంచాయతీ విలీనం కానుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామపంచాయతీ.. మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు విలీనమవుతాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో.. కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు కలవనున్నాయి. నాగారం మున్సిపాలిటీలో బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు విలీనమవుతాయి. పోచారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం కానున్నాయి. ఘట్‌కేసర్ మున్సిపాల్టీలో.. అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనమవుతాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు, తూంకుంట మున్సిపాలిటీలో.. బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం కానున్నాయి.
విలీన ప్రక్రియతో రెండు, మూడునెలల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడి గ్రామాల్లో జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపాలిటీల పదవీకాలం కూడా వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ఆ తర్వాత ఇప్పుడు విలీనమైన 51 గ్రామపంచాయతీలతో కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు.
మరోవైపు పంచాయతీల విలీనంపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో విలీనంతో తాము ఉపాధి పనులు కోల్పోవడంతో పాటు.. పన్నుల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
