Telangana: తెలుగింట కృష్ణవేణికి ‘ఆది’ అక్కడే.. రెండు రాష్ట్రాల రాజకీయాలకూ ‘ఆజ్యం’ అక్కడే!
'శిశువుకు దక్కని స్థన్యం' అనే ఓ గొప్ప సాహితీ ప్రయోగం చేశారు శ్రీశ్రీ. పాలమూరు జిల్లాకు సరిగ్గా సరిపోయే పదబంధం అది. కృష్ణవేణి తెలుగింట అడుగుపెట్టేది పాలమూరు జిల్లాలోనే. ఆ పాలమూరు నేలను ఒరుసుకుంటూ తుంగభద్ర ప్రవహిస్తుంది. భీమా నది పారుతుంది. సాధారణంగా కృష్ణమ్మ స్పర్శ ఉన్న ప్రతి ప్రాంతం పచ్చగా ఉంటుంది. ఒక్క పాలమూరు తప్ప. కృష్ణానది పరవళ్లు ఉన్నా.. కరువు మాత్రమే కనిపించే జిల్లా 'పాలమూరు'. కాలక్రమంలో వలస కూలీలు అనడం మానేసి పాలమూరు కూలీ అనేవాళ్లు. వీళ్లు ఉండని ప్రాంతం లేదు, వలస వెళ్లని కాలం లేదు, అక్కడి కరువుపై రాయని కవి లేడు. తీరని వెతలు.. తీరం లేని పయనాలు పాలమూరు జిల్లా వాసులవి. సరిగ్గా ఈ పాయింట్‌తోనే ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైంది. నీటి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య కొట్లాటకు కారణమైంది. రాష్ట్రమైతే విడిపోయింది గానీ.. పాలమూరు బతుకు మాత్రం అలాగే ఉంది. అందుకే, మళ్లీ అదే పాయింట్ ఇప్పుడు రాజకీయాంశం అయింది. 'పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదు' అనే స్టేట్‌మెంట్ నుంచి మరోసారి పొలిటికల్ సెగ రగిలింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఎన్టీఆర్, చంద్రబాబు నుంచి కేసీఆర్, రేవంత్ దాకా అందరి పేర్లూ వినిపిస్తున్నది ఆ 'పాలమూరు' చుట్టే. రెండు రాష్ట్రాలు.. ఐదు పార్టీల మధ్య యుద్ధమూ ఆ 'పాలమూరు' చుట్టే. తెలంగాణ చరిత్రలో రాజకీయాలు నడిచిందీ పాలమూరు చుట్టూనే. ఇంతకీ.. పాలమూరు సెంట్రిక్‌గా ఇప్పుడెందుకని రాజకీయాన్ని తీసుకొచ్చారు? అక్కడి నీళ్లలో నిప్పులెందుకు పోస్తున్నారు?

అక్కడి నేలకు తీరని దాహం. మనుషులకు తీరని దాహం. పశువులకూ తీరని దాహమే. ఏళ్లతరబడి బీళ్లు పడి.. దాహంతో నోళ్లు తెరుచుకునే భూములుండే ప్రాంతం అది. సహజంగానే అలాంటి నేల నుంచి ప్రశ్న పుడుతుంది. పోరాట జ్వాల రగులుతుంది. రాజకీయ చైతన్యాన్నీ పుట్టిస్తుంది. ఆగమనానికైనా, పునరాగమనానికైనా కేరాఫ్‌గా మారుతుంది. అందుకేగా కేసీఆర్ గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టి ఎన్నెన్నో టాపిక్‌లను ప్రస్తావించినా… హైలైట్ అయింది మాత్రం ఒక్క ‘పాలమూరు’నే. ఆ ఒక్క జిల్లాను టచ్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ మొత్తాన్నీ రగిల్చినట్టే. పాలమూరు చుట్టూనే ఎందుకీ రాజకీయం అనే ప్రశ్నకు ఇదే సమాధానం. కుతుబ్‌షాహీల కాలంలో మొదలైన పాలమూరు కూలీల వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా గానీ.. వలస అనే పదం మాత్రం పాలమూరునే అంటిపెట్టుకుని ఉంటోంది. తెలంగాణ వచ్చినా సరే వలసలు ఆగలేదా అంటే.. ఆగలేదు. ఓ డేటా చెప్పుకుందాం. పాలమూరు జిల్లాలో గిరిజనులు అత్యధికంగా నివసించే కొన్ని ప్రాంతాలున్నాయ్. అందులో సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, దామరగిద్ద, నారాయణపేట, కోయిల్‌కొండ, గండీడ్, నవాబ్‌పేట, మద్దూరు ఉన్నాయి. ఇక్కడ అర ఎకరం, ఎకరం, అసైన్డ్, సీలింగ్ భూములపై ఆధారపడ్డ గిరిజనులున్నారు. ఎత్తిపోతల ద్వారా నీళ్లిచ్చే పరిస్థితి లేక వర్షాధార పంటలే పండించారు. వర్షాల్లేని నాడు కూలీలకు పోయేవారు. అలా వలసల జిల్లాగా మారింది. 2016 డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే...
