Telangana: ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు..
హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. 11 మందిని అరెస్ట్ చేసి, ఇద్దరు నవజాత శిశువులను సురక్షితంగా రక్షించారు. పేద కుటుంబాల నుండి శిశువులను కొని, పిల్లలు లేని ధనిక దంపతులకు రూ.15 లక్షలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్ నగరంలో అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్రమంగా శిశువులను కొనుగోలు చేసి అమ్ముతున్న గ్యాంగ్‌కు చెందిన 11 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి ఇద్దరు నవజాత శిశువులను సురక్షితంగా రక్షించారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శిశువులను విక్రయిస్తున్న సమయంలో ప్రధాన నిందితుడితో పాటు అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో గ్రూపుగా ఏర్పడి శిశు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, తమ పిల్లలను పోషించలేమన్న వారి బలహీనతను ఆసరాగా చేసుకుని.. వారికి భారీ మొత్తం నగదులు ఆఫర్ చేసి శిశువులను కొనుగోలు చేస్తారు.
ఇలా కొన్న శిశువులను పిల్లలు లేని సంపన్న కుటుంబాలకు ఒక్కో శిశువును సుమారు రూ.15 లక్షలకు విక్రయిస్తూ భారీగా అక్రమ లాభాలకు తెరలేపారు. ఈ మొత్తం ప్రక్రియను మధ్యవర్తుల సహాయంతో ఓ పక్కా ప్లాన్డ్ చైన్‌గా నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వి. బాబు రెడ్డి IVF ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలి ఘటనలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ఒక శిశువును బయోలాజికల్ తల్లిదండ్రులకు డబ్బులు చెల్లించి, మధ్యవర్తుల ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చి పిల్లలు లేని దంపతులకు అమ్మేందుకు ప్రయత్నించారు. ఇదే తరహాలో సిద్దిపేట జిల్లా రామన్‌పేట నుంచి మరో శిశువును కూడా అక్రమంగా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. రక్షించిన ఇద్దరు నవజాత శిశువులను శిశు విహార్‌కు సురక్షిత సంరక్షణ కోసం అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అక్రమ రవాణా నెట్‌వర్క్ వెనుక ఉన్న మరిన్ని కోణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
