Jeddah Tower: బుర్జ్ ఖలీఫా రికార్డు బ్రేక్.. ఏకంగా కిలోమీటరు ఎత్తుతో మరో ప్రపంచ అద్భుతం..
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా రికార్డును సౌదీ అరేబియాలో నిర్మాణంలో ఉన్న జెడ్డా టవర్ బద్దలు కొట్టనుంది. 1000 మీటర్ల ఎత్తుతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా అవతరిస్తుంది. ప్రస్తుతం 80 అంతస్తులకు చేరిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. జెడ్డా టవర్ బుర్జ్ ఖలీఫా కంటే సుమారు 180 మీటర్లు ఎక్కువ ఎత్తుతో కొత్త చరిత్ర సృష్టిస్తుంది.

దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. ఇప్పటి వరకు దీనికి పోటీ, సాటి మరేది లేదు. కానీ ఈ రికార్డును త్వరలో మరొక భవనం కైవసం చేసుకునే అవకాశం ఉంది. అవును.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అనే రికార్డ్ కలిగి ఉన్న బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తైన భవనం ఆవిర్భావం ప్రారంభమైంది. నిర్మాణం జరుగుతోంది. 80వ అంతస్తు దాదాపు పూర్తయింది. దీంతో ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడే బుర్జ్ ఖలీఫా త్వరలోనే తన కిరీటాన్ని కోల్పోవచ్చు.
భవిష్యత్తులో అత్యంత ఎత్తైన భవనం ఎక్కడ నిర్మిస్తున్నారు?
సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న జెడ్డా టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా అవతరించే దిశగా సాగుతోంది. ఈ ఆకాశహర్మ్యం 1,000 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. బుర్జ్ ఖలీఫా కంటే దాదాపు 172 నుండి 180 మీటర్ల ఎత్తు ఉంటుంది. జెడ్డాలో ఉన్న ఈ మెగా ప్రాజెక్ట్ సౌదీ విజన్ 2030లో కీలకమైన భాగంకానుంది. నిర్మాణం జనవరి 2025లో తిరిగి ప్రారంభమైంది. టవర్ ఇప్పుడు దాదాపు 80 అంతస్తులకు చేరుకుంది. విశేషమేమిటంటే, ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు ఒక కొత్త అంతస్తు రెడీ అవుతోంది. ఇదే వేగం కొనసాగితే ఈ ప్రాజెక్ట్ 2028 నాటికి పూర్తవుతుంది.
తొలిసారి 1 కిలోమీటర్ రికార్డు
ఒకప్పుడు కింగ్‌డమ్ టవర్‌గా పిలువబడే ఈ ప్రాజెక్ట్ మానవ నిర్మాణ శైలి సరిహద్దులను కొత్త శిఖరాలకు చేర్చింది. పూర్తిగా భవనం కంప్లీట్ అయిన తర్వాత జెడ్డా టవర్ ప్రపంచంలో ఒక కిలోమీటరు ఎత్తును దాటిన మొదటి భవనంగా నిలుస్తుంది. ఇందులో లగ్జరీ ఫోర్ సీజన్స్ హోటల్, ప్రీమియం నివాసాలు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌లు, ఆధునిక కార్యాలయ స్థలం ఉంటాయి. అత్యంత విశేషం దాని ఆకాశమంత ఎత్తైన అబ్జర్వేషన్ డెక్. ఇది ఎర్ర సముద్రం, జెడ్డా నగరం పూర్తిగా కవర్ చేస్తూ అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది.
లిఫ్ట్ వేగం ఎంత ఉంటుంది?
ఈ ప్రాజెక్టును కూడా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ రూపొందించారు. సౌదీ అరేబియా వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్డా టవర్‌లో ఇంధన-సమర్థవంతమైన వ్యవస్థలు, అధునాతన శీతలీకరణ సాంకేతికత అమర్చబడి ఉంది. హై-స్పీడ్ లిఫ్టులు సెకనుకు 10 మీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. పై అంతస్తులకు చేరుకోవడం వేగంగా, ఈజీగా ఉంటుంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. దీని ఎత్తు 828 మీటర్లు, 163 అంతస్తులు. ఇది కేవలం ఒక భవనం కాదు.. 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




