TGPSC New Chairman: టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరణ.. తొలిరోజే మాస్ వార్నింగ్!
టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం గురువారం (డిసెంబర్ 5) బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలిరోజు సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ పై పూర్తి నమ్మకంతో పరీక్షలు రాయాలని అభ్యర్ధులకు సూచించారు..
హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇకపై పరీక్షల వాయిదాలు ఉండవని, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తొలగించుకోండంటూ.. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వార్నింగ్ ఇచ్చారు.
ఐఏఎస్ తన కల అన్నారు. కష్టపడి పబ్లిక్ సర్వెంట్‌గా మారానని, తనకు ఇంకా మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ నిరుద్యోగ అభ్యర్థుల కోసం.. సర్వీస్ వదులుకుని టీజీపీఎస్సీ బాధ్యతలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో పాటు భర్తీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. కమిషన్‌పై నమ్మకంతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు. 60 రోజుల్లోనే డీఎస్సీ రిజల్ట్స్ ఇచ్చామని, టీజీపీఎస్సీ ఫలితాలు కూడా అనుకున్న సమయంలోనే వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్నీ జరుగుతాయని, వాయిదాల ఉండబోవని మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగ నియమాకాల ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో యూపీఎస్సీతో సమానంగా టీజీపీఎస్సీ పని చేస్తుందన్నారు.
కాగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిమాజీ డిసెంబర్ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా రేవంత్ రెడ్డి సర్కార్ నియమిస్తూ నవంబర్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన 2030 వరకు టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు గురువారం (డిసెంబర్ 5న) ఆయన టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.