నానబెట్టిన శనగలు తినలేదనీ భర్తకు బడితపూజ.. చితకబాది.. వేలు కొరికేసి..

భర్త ఆరోగ్యంగా ఉండాలని నానబెట్టిన శనగలు తినాలని ఎంతో మురిపెంగా ఇచ్చింది ఓ భార్య.. కానీ భర్త వాటిని తినేందుకు నిరాకరించాడు. అంతే.. ఆ రోజు వాళ్ల కాలనీలో ఎవరూ నిద్రపోలేదు. భర్తను బండబూతులు తిడుతూ.. మిక్సర్ జార్ తీసుకుని భర్త తలపై కొట్టి.. కర్రతో ఒళ్లంతా వాయగొట్టింది..

నానబెట్టిన శనగలు తినలేదనీ భర్తకు బడితపూజ.. చితకబాది.. వేలు కొరికేసి..
Wife Beaten Her Husband
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 05, 2024 | 1:58 PM

పూణె, డిసెంబర్‌ 5: పతి దేవుడు పదికాలాలపాటు చల్లగా ఉండాలని.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని.. దాదాపు ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. భర్త కోసం కఠోర ఉపవాసాలు, పూజలు చేసి నిష్టగా వేయికోట్ల దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఓ భార్య ఈ విషయంలో నాలుగు పాళ్లు ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంది. నానబెట్టిన శనగలు ఉదయాన్నే తినిపిస్తే భర్త ఆరోగ్యంగా ఉంటాడని ఎవరో చెప్పారట. దీంతో ఆవిడగారు నానబెట్టిన శనగలు తినాలని భర్తను పట్టుబట్టింది. అయితే సదరు పతి దేవుడికి అవి ఇష్టంలేవేమో తినడానికి నిరాకరించాడు. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన భార్య పక్కనే ఉన్న కర్ర తీసుకుని నెత్తిమీద ఒక్కటిచ్చింది. అయినా శాంతించక అదే కర్రతో చితకబాది.. నానాతిప్పలు పెట్టింది. ఈ షాకింగ్‌ ఘటన పూణెలోని సోమవార్ పేటలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

మహారాష్ట్రలోని పుణె సిటీలోగల సోమవార్‌ పేట్‌లో త్రిశుండ గణపతి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో 44 ఏళ్ల భర్త, 40 ఏళ్ల భార్య కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో నానబెట్టిన శనగల విషయమై డిసెంబర్ 1 రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నానబెట్టిన శనగలు తినాలని భార్య ఇవ్వగా.. వాటిని తినేందుకు భర్త నిరాకరించాడు. తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఆగ్రహించిన భార్య అతడితో గొడవపడింది. బండబూతులు తిడుతూ కర్రతో కొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే మిక్సీ జార్‌తో తలపై మోదింది. అయినా కసి తీరక.. ముఖంపై గోళ్లలో రక్కింది. ఎడమ చెవి వెనుక భాగంలో రక్తం వచ్చేలా కొట్టింది. ఆమె ఉగ్రరూపాన్ని చూసి దడుసుకున్న భర్త పారిపోవాలని పరుగులంకించుకున్నాడు. అయినా ఏమాత్రం తగ్గని భార్య సుత్తి తీసుకుని అతటి వెంటపడింది. సుత్తిని అతడు లాగేసుకోవడంతో.. పక్కనే ఉన్న మిక్సర్‌ జార్‌తో రెండు సార్లు తలపై మోది, ప్యాంటు పట్టి లాగడంతో.. అదికాస్తా ఊడిపోయింది. దీంతో చేసేదిలేక అతడు ఇంట్లోనే కూలబడిపోయాడు. భార్యతో దెబ్బలు తినలేక చేతులు ముఖానికి అడ్డుగాపెట్టుకోవడంతో అతడి చేతి వేలు కసపస కొరికేసింది సదరు భార్యామణి.

దీంతో భయపడిపోయిన భర్త.. ఒక్క ఉదుటున ఇంటి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. తన గోడునంతా విన్న పోలీసులు విచారణకు వస్తాం.. ఇంటికి వెళ్లమని చెప్పగా.. అప్పటికే భయంతో వణికిపోతున్న బాధితుడు ఇంటికి వెళ్లేందుకు నిరాకరించాడు. రాత్రికి పోలీస్‌స్టేషన్‌లోనే ఆశ్రయం కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. దీంతో మరుసటి రోజు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉమేష్ గిత్తె సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుడి భార్యపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.