AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆకతాయితనంగా అమ్మ చీరతో ఉరి.. మెడకు బిగుసుకుపోవడంతో బాలుడు మృతి

స్కూల్ కి వెళ్లడం ఇష్టంలేదని ఓ బాలుడు చేసిన పని కన్నవారికి తీరని కడుపుశోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులను బెదిరిద్దామని ఆకతాయితనంతో ఇంట్లో తల్లి చీరతో ఉరి బిగించాడు. అనంతరం అందులో తల దూర్చి ఏమార్చి ఉండగా.. అది కాస్తా మెడకు బిగుసుకుంది. అంతే దాని ఉచ్చులో ఇరుక్కుపోయి మృత్యుఒడికి చేరాడు..

Andhra Pradesh: ఆకతాయితనంగా అమ్మ చీరతో ఉరి.. మెడకు బిగుసుకుపోవడంతో బాలుడు మృతి
School Boy In Guntur Hanged Himself
Srilakshmi C
|

Updated on: Dec 04, 2024 | 8:13 AM

Share

తుళ్లూరు, డిసెంబర్‌ 4: ప్రతి చిన్న విషయానికి పిల్లలు మొదలు పెద్దల వరకు చచ్చిపోతానని బెదిరించడం అలవాటైపోయింది. బెదిరింపులే ఒకనాడు నిజమై కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుంది. అలాంటి దారుణ ఘటన మరోమారు చోటు చేసుకుంది. లోకం తెలియని ఓ పసి పిల్లవాడు చనిపోతానని తల్లిదండ్రులను బెదిరించడానికి చేసిన పని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన ఆ బాలుడు చేసిన ఆకతాయి చేష్ట కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ దారుణ ఘటన గుంటూరులోని అనంతవరంలో జరిగింది. అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా అనంతవరం గ్రామానికి చెందిన ఓ జంటకు ఇద్దరు సంతానం. తల్లిదండ్రులు కష్టపడి కూలి పనులు చేసుకుంటూ పిల్లలు ఇద్దరినీ చదివించుకుంటున్నారు. రెండో కుమారుడు (11) గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుతున్నాడు. బాలుడికి బడికి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. దీంతో రోజూ స్కూల్‌కి వెళ్లనంటూ మారం చేసేవాడు. ఈ క్రమంలో నవంబర్‌ 21వ తేదీన ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి మంచంపైకి ఎక్కి తల్లి చీరను ఫ్యానుకు కట్టాడు. అనంతరం దానిని మెడకు గట్టిగా బిగించుకున్నాడు. అది ఆట అనుకున్నాడో.. లేదంటే నిజంగానే చావుకు సిద్ధపడ్డాడో తెలియదుగానీ అలా ఉరికొయ్యకు బాలుడు వేలాడాడు. కొద్దిసేపటికి ఆడుకోవటానికి అక్కడి వచ్చిన మరో బాలుడు గమనించి వెంటనే కేకలు వేస్తూ చుట్టుపక్కల స్థానికులను పిలిచాడు.

వారు వచ్చి బాలుడిని కిందికి దింపి చూడగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించారు. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడే గత 12 రోజుల పాటు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడాడు. ఈ క్రమంలో మంగళవారం బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బడికి వెళ్లడం ఇష్టంలేక తల్లిదండ్రులను బెదిరించాలనే ఉద్దేశంతో బాలుడు చీరతో ఉరి వేసుకుని ఉంటాడని, కానీ దురదృష్టవశాత్తు అదికాస్తా మెడకు బిగుసుకుపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.