AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC New Regulations: విద్యార్ధులపై యూజీసీ వరాల వర్షం.. ఇకపై ఏడాదికి 2 సార్లు అడ్మిషన్లు.. ఏక కాలంలో 2 డిగ్రీలు! ఇంకా

యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యా విధానంలో సరికొత్త మార్పులు తీసుకురానుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకత్వాలతో కూడిన ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో మునుపెన్నడూలేని విధంగా విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే పలు సంస్కరణలు పేర్కొంది. అవేంటంటే..

UGC New Regulations: విద్యార్ధులపై యూజీసీ వరాల వర్షం.. ఇకపై ఏడాదికి 2 సార్లు అడ్మిషన్లు.. ఏక కాలంలో 2 డిగ్రీలు! ఇంకా
UGC New Regulations
Srilakshmi C
|

Updated on: Dec 06, 2024 | 8:46 AM

Share

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5: ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చుడుతోంది. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, వ్యవధి, అర్హతలకు సంబంధించి పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాను గురువారం ప్రకటించింది. చాలావరకు విదేశీ వర్సిటీల విద్యా విధానాలను పోలి ఇవి ఉన్నాయి. గతంలో చదివిన కోర్సుతో సంబంధం లేకున్నా.. నచ్చిన కోర్సును డిగ్రీ, పీజీలో ఎంచుకునే వీలు కల్పించింది. అలాగే ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు, ఏకకాలంలో రెండు కోర్సులు చదివే అవకాశం కల్పించాలనే వెసులుబాటును కూడా ఈ ముసాయిదాలో పొందుపరిచారు. ఈ సంస్కరణల ద్వారా దేశ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలను చేరుకునేలా చేస్తామని యూజీసీ చైర్‌పర్సన్‌ జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

దీనిలో భాగంగా దేశంలోని ఆరు సెంట్రల్‌ వర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు కల్పించనున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికకు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయించడంతో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌ యూనివర్సిటీలు.. ఈ మేరకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ అడ్మిషన్లు ప్రతి ఏడాది జూలై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరిలో జరుగుతాయి. అలాగే విద్యార్థి 12వ తరగతి లేదా ఇంటర్‌, డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివాడనే దానికి సంబంధం లేకుండా డిగ్రీ, పీజీ చేసే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో లేదా వర్సిటీ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది.

విద్యార్థులు డిగ్రీ కోర్సులో మొత్తం క్రెడిట్లలో 50 శాతం కోర్సులోని ప్రధాన సబ్జెక్టుల నుంచి పొందాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం క్రెడిట్లను స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్సులు, అప్రెంటిస్‌షిప్‌, బహుళ సబ్జెక్టుల నుంచి పొందొచ్చు. అలాగే ఏక కాలంలో ఒక విద్యార్ధి రెండు డిగ్రీ లేదా పీజీ కోర్సులను చదివే అవకాశం కూడా ఉంటుంది. డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించుకునేందుకు, అలాగే పెంచుకునేందుకు వీలు కల్పిస్తారు. ఇందుకోసం యాక్సెలరేటెడ్‌ డిగ్రీ ప్రోగ్రాం (ఏడీపీ), ఎక్స్‌టెండెడ్‌ డిగ్రీ ప్రోగ్రాం(ఈడీపీ) విధానాలను ప్రవేశపెట్టనున్నారు. యూజీసీ ఈ మేరకు కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.