Hyderabad: రోడ్డుపై కారు ఆపి ఒక్కసారిగా డోర్ తీసిన డ్రైవర్.. పాపం బైక్‌పై వెళ్తున్నవారు
హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్. హఠాత్తుగా కారు డోర్ తీశాడు. దీంతో ప్రమాదం జరిగింది.
అన్నెం పున్నెం ఎరుగని పసిబిడ్డ డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైంది. కళ్లముందే కంటిపాప కన్నుమూయడంతో ఆ కుంటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. నడిరోడ్డుపై నిర్లక్ష్యంతెరిచిన కారు డోర్ తగిలి బైక్ పై వెళుతోన్న వారు కిందపడడంతో పసిబిడ్డ మృత్యువాత పడిన ఘటన గుండెలు పిండేస్తోంది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ దగ్గర…. మన్సూరాబాద్ మెయన్ రోడ్డు మీద కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడిన చిన్నారి పాపాయి ఘటనలో డ్రైవర్, ఓనర్ ల నిర్లక్ష్యం వారిలోని అమానుషత్వానికి అద్దం పడుతోంది. మరోవైపు ప్రమాదంలో ఉన్నవారికి సాయం చేయాలన్న కనీస స్పృహని కోల్పోయి…ప్రేక్షక పాత్ర వహించిన జనం వైఖరి… సమాజంలో పాతుకుపోయిన అమానవీయతకు అద్దం పడుతోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం….
ఖరీదైన కారు కదా రూల్స్ వర్తించవనుకున్నారేమో… రద్దీగా ఉండే నడిరోడ్డుపైన కారుని హఠాత్తుగా ఆపేశాడు ఓ డ్రైవర్. కారు డోర్ తెరిచే ముందు ఇరువైపులా చూసుకోవాలన్న కనీస నియమాన్ని కూడా విస్మరించి, నిర్లక్ష్యంగా కారు డోర్ తెరిచాడు డ్రైవర్. అదే రోడ్డుపై వస్తోన్న బైక్‌కి హఠాత్తుగా ఓపెన్ చేసిన కారు డోర్ తగలడంతో బైక్ పై వెళుతోన్న రెండేళ్ళ పసిబిడ్డ మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డోర్ తగిలి రోడ్డుపైన నెత్తుటి మడుగులో పడి ఉన్న పసిపిల్లను, స్పృహ కోల్పోయిన చిన్నారి తల్లిని కాపాడే ప్రయత్నం చేయకపోగా…పక్కకుతప్పుకువెళ్ళారు జనం. అంతేకాదు. ప్రమాదానికి గురైన డ్రైవర్ కానీ, కారులోనే ఉన్న ఓనర్ కానీ నెత్తురోడుతున్న వారి పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది.
డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటైతే… మరోవైపు15 నిముషాల పాటు నెత్తుటి మడుగులో పడిఉన్న తల్లీ బిడ్డలను తీసుకెళ్ళేందుకు ఎవ్వరూ సాయపడలేదు. ఓనర్ లోపలికెళ్ళాడు. కారు తాళాలు సైతం ఇవ్వలేదు. కనీసం ఆటో వాళ్ళు సైతం ఆపకుండా వెళ్ళిపోయారే తప్ప రక్తం మడుగులో పడి ఉన్న వారిని తరలించేందుకు సాయం చేయకపోవడంతో కాళ్ళా వేళ్ళాపడి చిన్నారినీ, ఆమె తల్లి శశిరేఖనీ కామినేని ఆసుపత్రికి తరలించారు పాప తండ్రి సయ్యద్. నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేసి పాప ప్రాణాలు పోవడానికి కారణమైన డ్రైవర్ దుర్గా ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ ఫిర్యాదుతో డ్రైవర్‌పై 304 (A), 337 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నోటీస్‌లు ఇచ్చి తర్వాత డ్రైవర్‌ను వదిలిపెట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..