Andhra News: అయ్యో ఎంత పని చేశావ్ బ్రో.. మందు మానేయమంటే.. ఏకంగా ప్రాణాలే వదిలేసి వ్యక్తి!
విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మద్యం వ్యసనం ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసింది. మద్యం అలవాటు మానుకోవాలని కుటుంబ సభ్యులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమై, మద్యం దుష్ప్రభావాలను మరోసారి కళ్ళకు కట్టింది.

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడలో ఓ పేద కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబంతో కలిసి జీవితాన్ని సక్రమంగా నడపాల్సిన లావేటి జగ్గునాయుడు (47) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ త్రాగుతూ పనీ పాట లేకుండా గడుపుడం స్టార్ట్ చేశాడు. ఇంటి పెద్దగా ఉన్న జగ్గునాయుడు ప్రవర్తనతో కుటుంబం గడవడం కూడా కష్టంగా మారింది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా బ్రతిమిలాడినా పట్టించుకునే వాడు కాదు.
అయితే ఓ రోజు రాత్రి జగ్గునాయుడు ఫుల్‌గా తాగి ఇంటికొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎందుకు తాగి వచ్చావ్ అని అతన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వారి మధ్య మాటామాట పెరిగింది. కుటుంబసభ్యులు ఈ సారి గట్టిగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం త్రాగడం మానేయాలని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జగ్గునాయుడు.. మద్యం మత్తులోనే ఇంట్లో ఉన్న గడ్డి మందు బాటిల్ తీసుకుని త్రాగేశాడు. కొద్దిసేపటికే అక్కడిక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు మార్చారు. అక్కడ చికిత్స అందించినా ఎలాంటి లాభం లేకపోయింది. అప్పటికే విషం శరీరం మొత్తం పాకి అతను ప్రాణాలు విడిచాడని వైద్యులు తెలిపారు. దీంతో బాధితుడి భార్య గౌరీశ్వరీ, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. జగ్గునాయుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. మద్యం వ్యసనం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
