Sunburn Event: ‘సన్‌బర్న్’ షోను అడ్డుకునేందుకు యత్నించిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం జీఎమ్మార్ ఎరీనాలో శుక్రవారం రాత్రి భారీ బందోబస్తు మధ్య ‘సన్‌బర్న్’ మ్యూజిక్ షో జరిగింది. ఈ ‘సన్‌బర్న్’ షోను అడ్డుకుంటామని మొదటి నుంచి ఎన్‌ఎస్‌యూఐ నాయకులు.. ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
Sunburn Event in Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం జీఎమ్మార్ ఎరీనాలో శుక్రవారం రాత్రి భారీ బందోబస్తు మధ్య ‘సన్‌బర్న్’ మ్యూజిక్ షో జరిగింది. ఈ ‘సన్‌బర్న్’ షోను అడ్డుకుంటామని మొదటి నుంచి ఎన్‌ఎస్‌యూఐ నాయకులు.. ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎరినా ప్రాంగణంలో సన్‌బర్న్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఎన్ఎస్‌యూఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్న NSUI విద్యార్థులు.. షో జరుగుతున్న హోటల్ దగ్గర రాత్రి ఆందోళనకు దిగారు. నిరసన కారులను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సన్ బర్న్ షో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎన్‌ఎస్‌యూఐ నేతల ప్రకటనలతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన పోలీసు సిబ్బందిని మోహరించారు. నోవాటెల్ వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసులు బ్లాక్ చేశారు. అయినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అక్కడి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
కాగా, నగరంలో రోజురోజుకు అత్యాచారాలు, డ్రగ్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘సన్‌బర్న్’ కార్యక్రమాన్ని రద్దు చేయాలని, ఇది తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకమని టీపీసీసీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులను కలిసి వినతి పత్రాలు కూడా సమర్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.