Nehru Zoological Park: నేటి నుంచి తెరుచుకోనున్న జూ పార్కులు.. సందర్శనకు వచ్చే వారి కోసం మార్గదర్శకాలు విడుదల
Nehru Zoological Park: కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు మూత పడ్డాయి. లాక్‌డౌన్ విధించడంతో మూతపడిన వ్యాపార సంస్థలు, ఇతర రంగాలు.. అన్‌లాక్..
Nehru Zoological Park: కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు మూత పడ్డాయి. లాక్‌డౌన్ విధించడంతో మూతపడిన వ్యాపార సంస్థలు, ఇతర రంగాలు.. అన్‌లాక్ ప్రక్రియ తర్వాత దాదాపుగా అన్ని తెరుచుకున్నాయి. ఇక తెలంగాణలో మూసివేసిన జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఆదివారం నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జూ పార్కులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడా తెరచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతించనున్నారు. దీంతో హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్ కూడా తిరిగి తెరుచుకోనుంది. ఈ రోజు నుంచి తెరుచుకోనున్న జూ పార్క్.. సందర్శనకు వచ్చే వారు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా జూ అధికారులు పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. పార్కును సందర్శించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి ఉండాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించనివారికి అనుమతి ఉండదని సూచించారు.
కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో సైతం విపరీతంగా పెరిగిన పాజిటివ్ కేసులు.. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ ఆంక్షలు, ఇతర చర్యల వల్ల కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో అన్ని వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి.