Hyderabad: స్కూల్‌లో డ్రగ్స్ తయారీపై సర్కార్ సీరియస్.. మేధా పాఠశాల సీజ్
మేధా హైస్కూల్‌పై విద్యాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. మేధా హైస్కూల్‌ను సీజ్ చేశారు. స్కూల్‌కు సంబంధించిన అన్ని అనుమతులను రద్దు చేశారు. ఈ స్కూల్‌లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిని ఇతర స్కూళ్లలో జాయిన్ చేసేందుకు విద్యా శాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బోయిన్‌పల్లి అల్ప్రాజోలం కేసులో పాలమూరు లింకులు. అవును.. సరుకు ఇక్కడ తయారవుతుంటే ఆ వాసన జిల్లాలో వస్తుంది. మేధా స్కూల్‌లో తయారైన అల్ప్రాజోలం మహబూబ్‌నగర్ భూత్పూర్‌కు సరఫరా అవుతోంది. ఇక్కడ ఈ అల్ప్రాజోలంతో కల్తీకల్లు తయారవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్లు కాంపౌండ్స్‌తో మేధా స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలింది.
ప్రతి రాత్రి హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వాహనంలో డబ్బాల నిండా అల్ప్రాజోలం వెళ్తోంది. గతంలో పార్శిల్స్‌లో పంపేవారు, కానీ వ్యాపారం పెరగడంతో ఇప్పుడు ప్రత్యేక వాహనాలే వినియోగిస్తున్నారు. ఈ విష రసాయనం జడ్చర్ల నుంచి కల్వకుర్తి, మహబూబ్‌నగర్ శివారు గ్రామాలకు సైతం యథేచ్ఛగా చేరుతోంది.
మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ దందా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతోనే యథేచ్ఛగా సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మాకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. అయితే అధికారుల ఈ ఉలుకు పలుకు లేని వైఖరి చూస్తుంటే, వారి సహకారం లేకుండా ఈ దందా సాధ్యం కాదన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
మరోవైపు మేధా స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మలేల జయప్రకాశ్‌గౌడ్ బోయిన్‌పల్లి సాయికాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేధా పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో అల్ప్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి ఫార్ములా కొనుగోలు చేసిన జయప్రకాష్, మేధ స్కూల్ అడ్డాగా చేసుకుని దందా కొనసాగిస్తున్నాడు. తొమ్మిది నెలల నుంచే ఈ దందా సాగుతున్నట్లు ఈగల్ టీమ్ విచారణలో తేలింది. అల్ప్రాజోలం తయారీతో జయప్రకాష్ నెలకు 40 లక్షలు సంపాదిస్తున్నట్లు తేలింది. జయప్రకాష్ గౌడ్‌కు శ్రీసాయి ట్రావెల్స్‌కు చెందిన ఉదయ్ సాయి, కొరియర్ బాయ్ మురళి సహకరిస్తున్నారు. రా మెటీరియల్ తీసుకురావడం, ఆల్ఫాజోలం డెలివరీ ఇవ్వడంలో వీళ్లది కీ రోల్.
Hyderabad police identified Jayaprakash Goud as the key accused in the Medha School drugs case. He supplied narcotics on his bike for 10 months, reaching Mahbubnagar and Sangareddy. The Eagle team recovered ₹23 lakh hidden in his factory.#Hyderabad #Telangana #DrugsCase
— Hyderabad Mail (@Hyderabad_Mail) September 14, 2025
మేధా స్కూల్ కేంద్రం జరుగుతున్న ఈ అరాచకాలపై ఈగల్ టీమ్ కన్ను పడింది. రెండు నెలల నుంచి జయప్రకాష్‌గౌడ్‌పై నిఘా పెట్టారు. శనివారం రెడీగా ఉన్న అల్ప్రాజోలంను వేరే జిల్లాలకు సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు కేసులో నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధాలు ఉన్న మరికొంత మందిని గుర్తించి అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
తాజాగా మేధా హైస్కూల్ సీజ్ చేసిన అధికారులు.. అన్ని అనుమతులు రద్దు చేశారు. ఇతర చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నారు.




