AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చాక్లెట్ల రూపంలో గంజాయి.. గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు..

హైదరాబాద్‌లో గంజాయి కలకలం రేపుతోంది. రోజు ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతుంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు ఏదొక రూపంలో గంజాయిని నగరానికి తరలిస్తున్నారు. ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రెండు ఘటనల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: చాక్లెట్ల రూపంలో గంజాయి.. గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు..
Ganja
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 30, 2026 | 3:13 PM

Share

హైదరాబాద్‌లో గంజాయి దందా కొత్త రూపాలు దాలుస్తోంది. ఒకవైపు చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తూ యువతను టార్గెట్ చేస్తున్న ముఠాలు.. మరోవైపు ఒడిషా నుంచి భారీగా గంజాయిని నగరానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లు.. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సాగుతున్న గంజాయి నెట్‌వర్క్‌ ఏ స్థాయిలో జరుగుతుందనేది నిర్ధారిస్తుంది. శామీర్‌పేట్‌లోని తూముకుంట చంద్రారెడ్డి కాలనీలో గంజాయి చాక్లెట్ల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పాన్‌ షాప్‌ను తనిఖీ చేయగా.. ఏకంగా 5,298 గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. దీంతో పాటు 25 కిలోల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన బైద్నాద్‌, అతని భార్య పూజాకుమారి హైదరాబాద్‌కు వలసొచ్చి కొంతకాలంగా ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బిహార్‌ నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి.. ఒక్కో ప్యాకెట్‌ను రూ.600కు విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. దాడి సమయంలో బైద్నాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. అతని భార్య పూజాకుమారి పరారైంది. ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది.

మరోవైపు ఒడిషా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్‌ టీమ్‌ భారీ ఆపరేషన్‌ చేపట్టింది. పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో 20 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుంది. స్మగ్లింగ్‌పై సమాచారం అందుకున్న ఈగల్‌ ఫోర్స్‌ దాదాపు 18 గంటలకు పైగా నిఘా నిర్వహించింది. విశాఖపట్నం జిల్లా సబ్బవరం నుంచి ప్రారంభమైన ఆపరేషన్‌.. చౌటుప్పల్‌ వరకు కొనసాగింది. చివరకు గంజాయి తరలిస్తున్న త్రిలోచన్‌ సమంత్ర, సాగర్‌ బాలాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని హైదరాబాద్‌కు చెందిన బికాష్‌ బారిక్‌ కోసం తీసుకొస్తున్నట్టు విచారణలో తేలింది. బికాష్‌ బారిక్‌పై ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఎన్డీపీఎస్‌ కేసు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ప్రధాన సప్లయిర్‌గా భావిస్తున్న త్రిలోచన్‌ సమంత్రపై ఒడిషాలో 7కి పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బికాష్‌ బారిక్‌తో పాటు ఒడిషాకు చెందిన అమిత్‌ సాహ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చాక్లెట్ల రూపంలో విక్రయాలు చేయడం నుంచి.. రాష్ట్రాల సరిహద్దులు దాటి భారీగా గంజాయి సరఫరా చేయడం వరకు ముఠాలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. వరుస ఆపరేషన్లతో పోలీసులు, ఈగల్‌ ఫోర్స్‌ నెట్‌వర్క్‌లపై దాడులు చేస్తున్నప్పటికీ.. గంజాయి దందాను పూర్తిగా అడ్డుకోవడం సవాల్‌గా మారుతోంది. హైదరాబాద్‌లో ఈ ముఠాల మూలాలపై దర్యాప్తును పోలీసులు మరింత విస్తరించారు.

Follow Us