AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్ బంక్‌లో ఒక్కసారిగా మంటలు.. బాంబులా పేలుతూ.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్!

పెట్రోల్ బంక్‌లో ఒక్కసారిగా మంటలు.. బాంబులా పేలుతూ.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్!

Balaraju Goud
|

Updated on: Aug 29, 2026 | 3:23 PM

Share

హైదరాబాద్‌లోని యాప్రాల్ పెట్రోల్ బంకులో బైక్ పెట్రోల్ నింపుకుని బయటకు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. బంకు సిబ్బంది అప్రమత్తంగా స్పందించి మండుతున్న బైక్‌ను దూరంగా తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బైక్ పూర్తిగా కాలి బూడిదైనా, ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంటలకు గల కారణాలపై స్పష్టత లేదు.

హైదరాబాద్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లో ఓ పెట్రోల్‌ బంక్‌లో బైక్‌ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. పెట్రోల్‌ పోయించుకుని బయటకు వెళ్తున్న సమయంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వాహనదారులు, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

పెట్రోల్‌ బంక్‌ నుంచి బయటకు వెళ్లే సమయంలో బైక్‌లో మంటలు రావడంతో వాహనదారుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. మంటలను ఆర్పేందుకు తొలుత నీటిని పోయడంతో అవి మరింత వేగంగా వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది వెంటనే స్పందించారు. మండుతున్న బైక్‌ను పెట్రోల్‌ పంపు ప్రాంతం నుంచి బయటకు తీసుకువచ్చారు. దీంతో పెట్రోల్‌ బంక్‌కు మంటలు వ్యాపించే ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికే బైక్‌ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బైక్‌లో మంటలు ఎలా చెలరేగాయి? సాంకేతిక లోపమా, పెట్రోల్‌ లీకేజీ కారణమా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us