Telangana: తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. దరఖాస్తు చేసుకోవాలంటే పాఠాలు వినాల్సిందే.. కఠిన నిబంధనలు వచ్చేశాయ్..
తెలంగాణలో మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలా.. అయితే నిబంధనలు మారనున్నాయి. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇప్పుడు మూడు గంటల వీడియో పాఠాలను కూడా వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో దీనిని ప్రవేశపెట్టారు.

తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్. డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ అన్నీ మారాయి. ఇక నుంచి పర్మినెంట్ లైసెన్స్ పొందాలనుకునేవారికి నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ తెలంగాణ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇప్పటినుంచి తప్పనిసరిగా ట్రాఫిక్స్ రూల్స్, రోడ్డు భద్రతకు సంబంధించి మూడు గంటల పాటు ఉండే వీడియో పాఠాలు వినాల్సి ఉంటుంది. వాటిని చూసిన తర్వాతనే డ్రైవింగ్ ట్రాక్ టెస్ట్‌కు అనుమతి మంజూరు చేస్తారు. వాహనదారులకు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు రవాణశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని కూకట్ పల్లి ఆర్టీఏ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర జోన్లకు కూడా విస్తరించే అవకాశముందని తెలుస్తోంది.
మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడం, డ్రైవింగ్ టెస్టుల్లో అక్రమాలను నివారించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు రవాణశాఖ వీడియో పాఠాలను తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి వీటిని తప్పనిసరిగా చూడాలనే నిబంధన విధించింది. ఈ వీడియోలు చూశాక డ్రైవింగ్ టెస్ట్‌కు అనుమతిస్తారు. డ్రైవింగ్ టెస్టులో క్వాలీఫై అయితే లైసెన్స్ మంజూరు చేస్తారు. ప్రస్తుత విధానంలో ముందుగా లెర్నింగ్ లైసెన్స్(LLR) తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఎల్ఎల్ఆర్ జారీ చేస్తారు. ఇది అందిన 30 రోజుల నుంచి ఆరు నెలల్లోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ఆర్టీఏ కార్యాలయలంలో మూడు గంటల పాటు వీడియో పాఠాలు చూడాల్సి ఉంటుంది. అనంతరం ట్రాక్ టెస్ట్‌కు పిలుస్తారు.
అయితే దరఖాస్తుదారుడు నిజంగా వీడియోలు చూశారా.. లేదా అనేది కూడా పరిశీలిస్తారు. ఇందుకోసం టీజీ ఆన్‌లైన్‌లో మాడ్యూల్స్ అందుబాటులో ఉంచింది. కాగా ప్రస్తుతం కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, నాగోల్, ఇబ్రహీంపట్నంలో డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారు ఇక్కడికి వెళ్లి ట్రాక్ టెస్టులకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ట్రాక్ టెస్టు అనంతరం మీకు ఒక స్లిప్ అందిస్తారు. మీరు పాస్ అయితే క్వాలీఫైడ్ అనే స్టాంప్ వేస్తారు. మీరు ఫెయిల్ అయితే రిజెక్టెడ్ అనే స్టాంప్ వేస్తారు. మీరు క్వాలీఫై అయితే పోస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కొన్ని రోజుల్లో ఇంటికి డెలివరీ పంపిస్తారు. ఇక ఉత్తీర్ణణ సాధించకపోతే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
