Hyderabad Rains: ఎటు చూసినా నీరే..నీరు.. జలనగరంగా మారిన భాగ్యనగరం..
మహా నగరం నీట మునిగింది.. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఏ గల్లీ చూసినా చెరువులను తలపిస్తున్నాయి.
మహా నగరం నీట మునిగింది.. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఏ గల్లీ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. చిన్న చినుకుకే వణికిపోయే హైదరాబాద్.. భారీ వర్షంతో అతలాకుతలమైంది. గత ఏడాది మిగిల్చిన చేతు జ్ఞాపకాలను మరోసారి కళ్ల ముందు నిలిపింది. బుధవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నగరం నీట మునిగింది. కుండపోత వానలతో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు, ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. అటు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత ఏడాది భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఇప్పుడు కూడా వరద చేరింది. హయత్‌నగర్, నాగోల్, సరూర్‌నగర్‌లో కాలనీలు నీట మునిగాయి. ఉప్పల్‌లో అధిక వర్షాపాతం నమోదైంది.
భారీ వర్షానికి నాగోల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ఇళ్లలో వరద నీరు ముంచెత్తింది. కాలనీలు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నాగోల్‌లోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. వందలాది కుటుంబాలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
భారీ వర్షానికి హైదరాబాద్‌లోని మూసీ ఉప్పొంగింది. మూసారాం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. మూసీ పరివాహన ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నగరంలోని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ కాలనీల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరింది.
అటు లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రామంతపూర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయింది. అటు పాతబస్తీలో కూడా లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.
భారీ వర్షంతో అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే దారిలోని మూసారాం బ్రిడ్జ్‌పై కి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్, ప్రశాంత్‌నగర్, మిథిలానగర్, బడంగ్‌పేట్ తో పాటు పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నాచారంలోని పలు కాలనీలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.
భారీ వర్షాలతో నాచారం, హబ్సీగూడ రహదారిలో భారీ వృక్షం నేలకూలింది. దీంతో రాకపోలకు అంతరాయం ఏర్పడింది. కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
భారీ వర్షంతో ఉప్పల్, అబ్దుల్లాపూర్‌పెట్‌లో అత్యధికంగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో 19, పెద్ద అంబర్‌పేటలో 18, సరూర్‌నగర్, రామంతపూర్‌లో 17 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. హబ్సీగూడలో 16, నాగోల్‌లో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
సరూర్‌నగర్‌లో గత ఏడాది ఎంత వరద ముంచెత్తింతో ఇప్పుడు కూడా అదే స్థాయిలో వరద ఇళ్లను చుట్టు ముట్టిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని చాలా ప్రాంతాలు నీటీలో నానుతున్నాయి.