Hyderabad: టెన్త్ కూడా పాస్ అవ్వకుండా 20 ఏళ్లుగా వైద్యం.. ఈ డెంటల్ డాక్టర్ ఎలా దొరికాడంటే?
నేరేడ్మేట్ ప్రాంతంలో గత దాదాపు 20 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తూ డెంటల్ సేవలు అందిస్తున్న రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన రమేష్ ఎలాంటి వైద్య అర్హతలు లేకపోయినా, డాక్టర్‌గా నటిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నట్టు తేలింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి..

హైదరాబాద్, మార్చి 25: మల్కాజిగిరి పోలీస్ కమినరేట్ పరిధిలో నకిలీ డెంటల్ డాక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరేడ్మేట్ ప్రాంతంలో గత దాదాపు 20 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తూ డెంటల్ సేవలు అందిస్తున్న రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన రమేష్ ఎలాంటి వైద్య అర్హతలు లేకపోయినా, డాక్టర్‌గా నటిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నట్టు తేలింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రమేష్‌కు కనీసం SSC సర్టిఫికెట్ కూడా లేదని, 10వ తరగతి కూడా పాస్ కాలేదని అధికారులు గుర్తించారు. అయినప్పటికీ, తాను BDS చదివానని చెప్పి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి డెంటల్ డాక్టర్‌గా అవతారం ఎత్తినట్లు వెల్లడైంది. యూపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి క్లినిక్ ప్రారంభించి, ప్రజలను మోసం చేస్తున్నాడు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రమేష్ తన క్లినిక్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు మాత్రమే నడిపేవాడని పోలీసులు తెలిపారు. ఇది అనుమానాస్పదంగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, మల్కాజిగిరి SOT పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో అసలు విషయం బయటపడింది. పూర్తి స్థాయి తనిఖీల తర్వాత రమేష్ వద్ద ఎలాంటి విద్యార్హతలు లేకపోవడం, నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం అందిస్తున్నట్టు నిర్ధారణ కావడంతో వెంటనే అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంతకాలం నకిలీ డాక్టర్ చేతుల్లో చికిత్స తీసుకున్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తూ, అతనితో సంబంధం ఉన్న ఇతర అంశాలపై కూడా విచారణ చేపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




