Telangana Politics: ‘బుల్డోజర్లను సిద్ధం చేశాం.. అక్కడే ఉంటాం’.. మూసీ ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
మూసీ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్, బీజేపీ గొంతెత్తుతుంటే.. అధికారపక్షం కూడా వాయిస్ పెంచింది. మంత్రులు మాటల తూటాలు పేలుస్తున్నారు. పేదలను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదంటున్న బీఆర్‌ఎస్.. బాధితులకు అండగా ఉంటానంటోంది. ప్రాజెక్ట్ బడ్జెట్‌ని ప్రజల్లో చర్చకు పెడుతోంది. పునరావాసంతో నిర్వాసితులు సంతృప్తిగా ఉంటే.. బీఆర్‌ఎస్ ఓర్చుకోలేకపోతోందని ప్రభుత్వం ఫైరవుతోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీ నిర్వాసితులకు మద్దతుగా కొందరు బుల్డోజర్లకు అడ్డం పడతామని అంటున్నారని.. అలాంటి వారి కోసం బుల్డోజర్లను సిద్ధం చేశానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నిర్వాసితుల కోసం మూడు నెలలు కాదు మూడేళ్లు అక్కడ ఉంటానని.. మూసీ ప్రాంతంలో ఉండటం తనకు కొత్త కాదని కేటీఆర్ అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లు కూలుస్తామంటే ప్రభుత్వానికి సహకరించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేయడం.. ఇప్పుడు మరింత హీటెక్కించింది.. మూసీ నిర్వాసితుల కోసం బీజేపీ ఉద్యమం ప్రారంభించింది.. వారికి మద్దతుగా రేపు ఆందోళనకు దిగనుంది..
నేను సిద్ధం: కేటీఆర్
మూసీ పక్కన మూడు నెలలు ఉండేందుకు తాను సిద్ధమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.. మూసీపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామన్నారు. నాగోల్‌లోని మురుగు శుద్ధి కేంద్రాన్ని మాజీ మంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది బ్యూటిఫికేషన్ కాదని… లూటిఫికేషన్ అని అన్నారు. మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లే అన్నారు. మూసీ నది లోతు పెంచి… కోల్‌కతా వంటి నగర నిర్మాణం చేయాలన్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు.
పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
ఇదిలాఉంటే.. మూడు నెలలపాటు తాను మూసీ నది పక్కన నివాసం ఉండేందుకు తాను సిద్ధమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మూసీ పరీవాహక ప్రాంతాలైన లంగర్ హౌస్ డివిజన్‌లోని రాందేవ్ గూడ, బాపూనగర్ ప్రాంతాలను సందర్శించిన కిషన్ రెడ్డి.. స్థానికులతో మాట్లాడారు. పేదల ఇంటిని కూల్చివేసి.. ఆ స్థలంలో సుందరీకరణ చేస్తామనుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. ముందు రిటైనింగ్ వాల్ కట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రికి చేతనైతే మూసీలో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంత్రి పొంగులేటి ఏమన్నారంటే..
మూసీపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అభివృద్ధి చేస్తామంటే బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్నా మేం వెనక్కి తగ్గమని చెప్పారు. పేదల జీవితాలు మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని.. ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో బీఆర్ఎస్ సూచనలు ఇవ్వాలన్నారు. మంచి సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామంటూ పేర్కొన్నారు. నల్గొండ ప్రజలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు..
ఇలా మొత్తంగా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయం తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది..
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..