Sabarimala: శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు.. ఆలయ దర్శన వేళలు పొడగింపు
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది.
శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ.. దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని.. భారీగా తరలివచ్చారు. అయితే భారీగా వచ్చిన భక్తులతో రద్దీ నెలకొనడంతో 10 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించకపోవడంతో క్యూలైన్లలోనే తోపులాటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయని.. అయ్యప్ప భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా.. కనీసం తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
దర్శన వేళలు పొడగింపు..
భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు దర్శన వేళలను మూడు గంటల పాటు పొడగించారు. సాధారణంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయాన్ని మూసివేసి.. సాయంత్రం 5 గంటలకు ఓపన్ చేస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మూసివేసి.. 4 గంటలకు ఓపన్ చేయాలని నిర్ణయించారు. దర్శన వేళలు మూడు గంటలు పొడగించడంతో భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు లబ్ధి పొందనున్నారు.