TGPSC Group 1 Mains: ‘గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు.. ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు’: డీజీపీ జితేందర్ వార్నింగ్
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా కోరుతూ పలువురు అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు సర్కార్ మాత్రం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. కోర్టు ఆదేశాల మేరకే పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏవైనా అభ్యంరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాని, ఇబ్బందులు కలుగజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా డీజీపీ వార్నింగ్ ఇచ్చారు..
హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గ్రూప్ 1 అభ్యర్ధులు సచివాలయం వద్దకు చేపట్టిన ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎంట్రీతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురు గ్రూప్ 1 అభ్యర్ధులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఇలా ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధులు ఆందోళన చేపడుతుంటే.. మరోవైపు టీజీపీఎస్సీ చకచకా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. పరీక్షకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన శనివారం తెలిపారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, అవాంతరాలు కలిగించినా.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ మేరకు మాట్లాడారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పరీక్షలుజరుగుతాయని, నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీ జితేందర్ చెప్పారు.
కాగా మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు హైదరాబాద్ పరిధిలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థులు సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు
టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుంటూ పోతుంటే.. మెయిన్స్ వాయిదా వేయాలంటే అభ్యర్ధులు అందోళన ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. గ్రూప్-1 పరీక్షల నోటిఫికేషన్ జారీని, కీలో తప్పులున్నాయని, పరీక్షలను రద్దు చేయాలన్న అభ్యర్థనలను తిరస్కరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. ప్రిలిమినరీ పరీక్ష కీలో తప్పులున్నందున పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేలా ఆదేశించాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ అక్టోబర్ 15న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జి దామోదర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరిలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని, అప్పుడు కొత్త నోటిఫికేషన్‌పై అభ్యంతరం చెప్పని పిటిషనర్లు పరీక్షలు రాసిన తరువాత కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. అదీ ఫలితాలు విడుదల చేసిన తరువాత కోర్టుకు వచ్చారని, 8 మంది పిటిషనర్లలో ఇద్దరు మెయిన్స్‌కు అర్హత సాధించారని, కేవలం ఆరుగురు అభ్యంతరాలపై లక్షల మంది హాజరయ్యే పరీక్షలను నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇప్పటికే రెండుసార్లు రద్దయ్యాయి ఇలా ఎన్నేళ్లు? పరీక్షలను రద్దు చేస్తూ వెళ్లాలంటూ వ్యాఖ్యానించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో 31,383 మంది అంటే దాదాపు 90 శాతం మంది హాల్‌టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారని, మరో రెండు రోజుల్లో జరగనున్న పరీక్షకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, ఈ దశలో వాయిదా వేయలేమని కోర్టు తేల్చి చెప్పింది.