AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓ తండ్రి మరణశాసనం.. పండగ పూట ఇద్దరు కుమారులను బావిలోకి తోసి, తానూ దూకేశాడు!

డిగినంత డబ్బు ఇవ్వకుంటే ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని భార్యను బెదిరించిన ఓ కసాయి అన్నంత పనీ చేశాడు. భార్యపై పంతం నెగ్గించుకోవడానికి కన్నతండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు. దసరా పండగ రోజు ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డల్ని ఒకేసారి పోగొట్టుకున్న ఆ తల్లి హృదయవిదారకంగా..

Telangana: ఓ తండ్రి మరణశాసనం.. పండగ పూట ఇద్దరు కుమారులను బావిలోకి తోసి, తానూ దూకేశాడు!
Father throws his kids into well
Srilakshmi C
|

Updated on: Oct 14, 2024 | 6:39 PM

Share

తాడ్వాయి, అక్టోబర్‌ 14: అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని భార్యను బెదిరించిన ఓ కసాయి అన్నంత పనీ చేశాడు. భార్యపై పంతం నెగ్గించుకోవడానికి కన్నతండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు. దసరా పండగ రోజు ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డల్ని ఒకేసారి పోగొట్టుకున్న ఓ తల్లి హృదయవిదారకంగా రోధించింది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో చోటు చేసుకుంది.

నందివాడ గ్రామానికి చెందిన చిట్టెపు గుండ్రెడ్డి, సుగుణ దంపతుల చిన్న కుమార్తె అపర్ణకు మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని నయాగావ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి (36)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గుండ్రెడ్డి, సుగుణ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, అపర్ణ దంపతులు నందివాడలో నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విఘ్నేశ్‌రెడ్డి (6), చిన్న కుమారుడు అనిరుధ్‌ (4) ఉన్నారు. కొంతకాలంపాటు వీరి కాపురం సజావుగానే సాగినా.. కొద్ది రోజులుగా అపర్ణ, శ్రీనివాస్‌రెడ్డిల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఇల్లరికం వచ్చానని తనను అత్తింటివారు చిన్న చూపు చూస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి మనోవేదనకు గురయ్యాడు. సెల్‌ఫోన్‌ రీఛార్జికి కూడా వాళ్లను డబ్బులు అడగవల్సి వస్తుందని స్నేహితుల వద్ద వాపోయేవాడు.

ఈ క్రమంలో శ్రీనివాస్‌ రెడ్డి భార్య, అత్తింటి వాళ్లపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా వాళ్లకు మనశ్సాంతి లేకుండా చేయాలని అనున్నాడు. దీంతో దసరా రోజు ఇద్దరు పిల్లలకు కొత్త బట్టలు వేయించుకుని, బైక్‌పై శమీ పూజకని తీసుకెళ్లాడు. భార్యను మాత్రం ఇంటి వద్దే వదిలేశాడు. చీకటి పడినా పిల్లలు, భర్త ఇంటికి రాకపోవడంతో అపర్ణ ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో ఊరంతా వెతికారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌, చెప్పులు కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో నుంచి ఇద్దరు చిన్నారులను బయటికి తీశారు. మోటార్లు వేసి నీటిని బయటికి తోడటంతో బావిలో శ్రీనివాస్‌ రెడ్డి మృతదేహం లభ్యమైంది. భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న అపర్ణ రోదన మిన్నంటింది. బిడ్డల మృతదేహాలను గుండెలకు హత్తుకుని రోదించిన విధానం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పొలం వద్ద తెలిసిన వాళ్ల సెల్‌ఫోన్‌ నుంచి మహారాష్ట్రలోని తండ్రికి ఫోన్‌ చేసి నంబరు రీఛార్జి చేయాలని అడిగినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.